Nirmal: అక్కాపూర్ సబ్‌స్టేషన్‌కు 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు!
Nirmal: నిర్మల్ అక్కాపూర్ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరాకు ఆదేశం.. కొత్తగా 160 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు.
Nirmal: అక్కాపూర్ సబ్‌స్టేషన్‌కు 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు!
నిర్మల్: నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లోని 220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ను టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సబ్‌స్టేషన్‌లో విద్యుత్ సరఫరా, లోడ్ పరిస్థితి, ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాల పనితీరును సీఎండీ పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి రైతులకు అందుతున్న వ్యవసాయ విద్యుత్ సరఫరాపై వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ లోడ్‌కు అనుగుణంగా అక్కాపూర్ సబ్‌స్టేషన్‌కు కొత్తగా 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంజూరు చేశారు.
కాలిపోయిన 50 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసినందున దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకొని వ్యవసాయ రంగానికి నిరంతరాయ విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ట్రాన్స్‌ఫార్మర్‌పై అయినా అధిక లోడ్ నమోదైతే వెంటనే పరిస్థితిని సమీక్షించి అవసరమైన చోట అదనపు లేదా కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సబ్‌స్టేషన్లలో సిబ్బంది అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా లైన్ క్లియరెన్స్ (ఎల్‌సీ)లు ఇవ్వకుండా ముందస్తు ప్రణాళికతో పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. సబ్‌స్టేషన్లు, విద్యుత్ లైన్లు, పరికరాల వద్ద విధులు నిర్వహించే సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సీఎండీ స్పష్టం చేశారు. భద్రతా పరికరాలను వినియోగిస్తూ పనులు చేపట్టాలని, విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని సూచించారు.
గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాల వద్ద విద్యుత్ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ లైన్లకు సమీపంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సబ్‌స్టేషన్లలోని కెపాసిటర్ బ్యాంకులను సమర్థంగా వినియోగించి పవర్ ఫ్యాక్టర్‌ను మెరుగైన స్థాయిలో నిర్వహించాలని సూచించారు.
వాటి పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాలని తెలిపారు. రైతులకు వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా, వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సీఎండీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో CGRF మెంబర్ టెక్నికల్ జేఆర్ చవాన్, ఎస్‌ఈ రమేష్, డీఈలు నాగరాజు, తిలక్, వెంకట్రామయ్య, ఏఈలు సంజీవ్, వెంకటపతి రాజు, మల్లేష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




