Gudihatnoor: గుడిహత్నూర్లో వైభవంగా వంజరి సంఘం దసరా మేళా!
Gudihatnoor: గుడిహత్నూర్ మన్నూర్లో వంజరి సంఘం ఆధ్వర్యంలో దసరా మేళా. 3,000 మందికి పైగా హాజరు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సత్కారం!
Gudihatnoor: గుడిహత్నూర్లో వైభవంగా వంజరి సంఘం దసరా మేళా!
గుడిహత్నూర్: గుడిహత్నూర్ మండల పరిధిలోని మన్నూర్ గ్రామంలో గల ఎస్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం వంజరి సంఘం ఆధ్వర్యంలో దసరా మేళా వేడుకలు అత్యంత వైభవంగా, కన్నులపండువగా సాగాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరిసిన ఈ ఉత్సవాలకు దాదాపు 3000 వేల మందికి పైగా వంజరి కులబాంధవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా వంజరి సమాజ ఆరాధ్య దైవం సంత్ భగవాన్ బాబా చిత్రపటానికి ముఖ్య అతిథులు పూలమాలలు వేసి, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వంజరి సంఘం ప్రధాన కార్యదర్శి కోటంకర్ లక్ష్మీనారాయణ, ఆల్ ఇండియా వంజరి సంఘం జనరల్ సెక్రటరీ అనిల్ ఫడ్, మహారాష్ట్ర నుండి వచ్చిన ప్రముఖ విద్యావేత్త మోటివేటర్ విట్టల్ కాగ్నే హాజరై ప్రసంగించారు. సమాజంలో ఐక్యత, విద్యాభివృద్ధే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు, వేషధారణలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం వంజరి కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో ఎంబీబీఎస్, నీట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను వేదికపై శాలువాలతో ఘనంగా సత్కరించి, వారిని అభినందించారు. అనంతరం విచ్చేసిన స్వజాతి బంధువులందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మేళా ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, వివిధ గ్రామాల పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




