AP: అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్‌కు సీఆర్డీఏ ఆమోదం!

AP: సీఆర్డీఏ 66వ సమావేశంలో కీలక నిర్ణయాలు: అమరావతి అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్, 29 గ్రామాల్లో రూ.1548 కోట్ల మౌలిక వసతుల పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Sept 2026 10:20 PM IST
AP
X

AP: అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్‌కు సీఆర్డీఏ ఆమోదం!

AP: అమరావతి రాజధాని అభివృద్ధిలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాజధాని పరిధితో పాటు విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో రాజధాని ప్రాంతంలో పెరగనున్న జనాభా, ఉద్యోగ, వాణిజ్య కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు సులభమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. రాజధాని ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధి, అసెంబ్లీ భవన నిర్మాణం, రైతులకు యాన్యుటీ, భూముల కేటాయింపు, పచ్చదనం, ప్రజా రవాణా వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు.

అసెంబ్లీపై 250 మీటర్ల స్పియర్ టవర్

అమరావతిలో నిర్మించనున్న నూతన అసెంబ్లీ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్ నిర్మించేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. స్పియర్‌తో పాటు లిఫ్ట్‌ల నిర్మాణానికి కలిపి రూ.661 కోట్ల వ్యయానికి అనుమతి ఇచ్చింది. ప్రజాస్వామ్యానికి అత్యున్నత వేదికగా నిలిచే అసెంబ్లీ భవనం దేశంలోనే ప్రత్యేకమైన నిర్మాణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

అసెంబ్లీ భవనంలో వ్యూపాయింట్ ఏర్పాటు చేసే అంశంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రత్యేక ఆకర్షణగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. రాజధానిలో నిర్మిస్తున్న అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లతో పాటు క్వాంటం టవర్స్, బిట్స్ పిలానీ వంటి భవనాలు కూడా ప్రత్యేక నిర్మాణాలుగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.

29 గ్రామాల్లో రూ.1548 కోట్ల పనులు

రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రోడ్లు, ఇతర ప్రాథమిక మౌలిక వసతులు, పట్టణాభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా చేపట్టేందుకు చర్యలు తీసుకోనున్నారు.

రాజధాని నిర్మాణంలో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తూనే భవిష్యత్ అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. నగరం విస్తరించే కొద్దీ ప్రజలకు అవసరమయ్యే రవాణా, వాణిజ్య, నివాస, పర్యాటక సదుపాయాలకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అన్నారు.

రెండో దశలో చిన్న కమతాల రైతులకు యాన్యుటీ

రెండో దశ భూ సమీకరణలో ఒక ఎకరా కంటే తక్కువ కమతం ఉన్న రైతులకు యాన్యుటీ చెల్లించే అంశానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. భూ సమీకరణ ప్రక్రియలో చిన్న కమతాలు కలిగిన రైతులకు కూడా ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్ణయంతో రెండో దశలో భూములు సమీకరణలో భాగమైన అర్హులైన చిన్న రైతులకు యాన్యుటీ చెల్లింపునకు మార్గం సుగమమైంది.

హోటళ్లు, పాఠశాలలకు భూముల కేటాయింపు

రాజధానిలో అవసరమైన వాణిజ్య, విద్యా మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు హోటళ్లు, పాఠశాలలకు భూముల కేటాయింపుపై మంత్రుల కమిటీ చేసిన సిఫార్సులకు సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతి భవిష్యత్‌లో పరిపాలనా కేంద్రంగానే కాకుండా విద్య, పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా అభివృద్ధి చెందేలా అవసరమైన వసతులను ముందుగానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యం

అమరావతి నగరంలో 50 శాతం సస్టెయినబుల్ గ్రీన్ కవర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి పేరుతో పచ్చదనం, జీవ వైవిధ్యానికి నష్టం కలగకుండా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బయోడైవర్సిటీని కాపాడడంతో పాటు పుష్ప జాతులకు చెందిన మొక్కలను విస్తృతంగా నాటాలని అన్నారు.

అమరావతిలోని కొండలు, నీటి వనరులను కూడా ప్రత్యేక ఆకర్షణలుగా తీర్చిదిద్దేలా బ్లూప్రింట్ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. సహజ వనరులను కాపాడుతూ వాటిని పర్యాటక, పర్యావరణ పరిరక్షణ ప్రాంతాలుగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

దేశవిదేశాల్లో అమరావతి పేరు మార్మోగాలి

అమరావతి నగరానికి దేశవిదేశాల్లో గుర్తింపు వచ్చేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. అమరావతి పేరు ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల లద్దాఖ్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన ఒక బైకర్‌ను అక్కడి బాలుడు ‘అమరావతి నుంచి వచ్చారా?’ అని అడిగిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. రాజధాని పేరు ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా తెలిసేలా ప్రచారం అవసరమని చెప్పారు.

అమరావతి బ్రాండింగ్‌లో విద్యుత్ స్తంభాలు లేని నగరం, బ్లూ-గ్రీన్ సిటీ, డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ వంటి ఐదు అంశాలను ప్రధాన థీమ్‌లుగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమరావతి అభివృద్ధి కేవలం ప్రభుత్వ ప్రాజెక్టుగా కాకుండా ప్రతి పౌరుడు ‘ఇది నా నగరం’ అనే భావనతో అనుసంధానం అయ్యేలా ప్రచారం ఉండాలని అన్నారు.

సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా అమరావతి

రాజధాని నగరాన్ని భవిష్యత్‌లో స్వయం సమృద్ధిగా నిర్వహించే విధంగా రెవెన్యూ మోడళ్లపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అమరావతి నిర్వహణకు అవసరమైన ఆదాయ వనరులను ముందుగానే గుర్తించి, నగరం తన అవసరాలను తానే సమకూర్చుకునే విధంగా ఆర్థిక నమూనాను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

భవిష్యత్ రెవెన్యూ మోడళ్లపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించాలని అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి, నిర్వహణ, మౌలిక వసతుల విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆదాయ మార్గాలను కమిటీ పరిశీలించనుంది.

విజయవాడ–గుంటూరు–మంగళగిరి–తాడేపల్లి మెగా సిటీ

విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలను కలుపుకుని భవిష్యత్‌లో అమరావతి మెగా సిటీగా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతాల మధ్య రవాణా అనుసంధానం కీలకంగా మారనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ వ్యవస్థపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రాజధాని అభివృద్ధి వేగం పెరిగే కొద్దీ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల మధ్య ప్రయాణించే అవకాశం ఉండటంతో రవాణా వ్యవస్థకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. నగర విస్తరణకు అనుగుణంగా రోడ్లు, ప్రజా రవాణా, ఇతర మౌలిక వసతులు సమన్వయంతో అభివృద్ధి చెందేలా ప్రణాళిక ఉండాలని సూచించారు.

ప్రత్యేక గుర్తింపుతో అమరావతి నిర్మాణం

అమరావతి నిర్మాణంలో కేవలం భవనాలు, రోడ్లకే పరిమితం కాకుండా పచ్చదనం, బయోడైవర్సిటీ, ప్రజా రవాణా, గ్రీన్ ఎనర్జీ, డీప్ టెక్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధాని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి చేయాలని అన్నారు.

సీఆర్డీఏ అథారిటీ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు పురపాలక, ఆర్థిక, ఐ అండ్ ఐ, సీఆర్డీఏ, ఏడీసీ అధికారులు హాజరయ్యారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేసేందుకు అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.