ఏపీని వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు సహకరించండి: లోకేష్
Amaravati: అహ్మదాబాద్‌లో ఐసీసీ ఛైర్మన్ జై షాతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ సహకారం కోరిన లోకేష్.
ఏపీని వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు సహకరించండి: లోకేష్
అమరావతి: అహ్మదాబాద్‌లో ఐసీసీ చైర్మన్ జై షాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయి స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ఐసీసీ, బీసీసీఐ సహకారం అందించాలని కోరారు. ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ టెక్నాలజీ, యువతలో నైపుణ్యాభివృద్ధిని అనుసంధానం చేస్తూ రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు.
ఐసీసీ చైర్మన్‌గా అంతర్జాతీయ క్రికెట్ అభివృద్ధికి జై షా చేస్తున్న కృషిని లోకేష్ అభినందించారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కడం, ఐపీఎల్ మీడియా హక్కులకు రికార్డు స్థాయి విలువ రావడం, మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం, మహిళా క్రికెటర్లకు సమాన వేతనం వంటి అంశాలను ప్రస్తావించారు.
విశాఖపట్నాన్ని వాటర్ స్పోర్ట్స్‌కు ప్రత్యేక గమ్యస్థానంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని లోకేష్ కోరారు. సెయిలింగ్, రోయింగ్, విండ్సర్ఫింగ్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్, బీచ్ వాలీబాల్ వంటి క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి, భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ పోటీలకు విశాఖను వేదికగా మార్చే అవకాశాలపై చర్చించారు.
అదే విధంగా దేశీయ క్రికెట్ టోర్నమెంట్లు, మహిళల క్రికెట్ పోటీలు, జాతీయ శిబిరాలకు ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మంగళగిరిలో 128 స్థానిక జట్ల భాగస్వామ్యంతో మంగళగిరి ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించిన విషయాన్ని జై షా దృష్టికి తీసుకెళ్లారు.
క్షేత్రస్థాయిలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ప్రీమియర్ లీగ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు లోకేష్ తెలిపారు. గాంధీనగర్ ప్రీమియర్ లీగ్ స్ఫూర్తితో యువతను పెద్దఎత్తున క్రీడల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.
మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు చేపట్టిన కార్యక్రమాలను కూడా మంత్రి వివరించారు. మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మంగళగిరిలో మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ను ప్రారంభించి, తొలి టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. WPL, జాతీయ మహిళల క్రికెట్ శిబిరాలు, ఇతర దేశీయ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీని ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, బాలికల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విద్య, మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘షీ ప్లేస్’ కార్యక్రమం గురించి కూడా జై షాకు వివరించారు.
టైర్-2, టైర్-3 ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇండోర్ క్రికెట్ శిక్షణా అకాడమీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని లోకేష్ తెలిపారు. ఈ అకాడమీలకు బీసీసీఐ నుంచి సాంకేతిక మార్గదర్శకత్వంతో పాటు అవసరమైన నిధులు అందించాలని జై షాను కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అవకాశాలు కల్పించడం ద్వారా భవిష్యత్ క్రికెట్ ప్రతిభను తయారు చేయవచ్చని వివరించారు..




