Amaravati: ఏపీ పోలీసు క్రీడాకారుల కోసం ‘ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ’!

Amaravati: రాష్ట్ర పోలీసులను జాతీయస్థాయిలో తీర్చిదిద్దేందుకు ఏపీ పోలీసు స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. విశాఖ రేంజ్ ఛాంపియన్.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada
Published on: 5 Sept 2026 8:05 AM IST
Amaravati
X

Amaravati: ఏపీ పోలీసు క్రీడాకారుల కోసం ‘ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ’!

Amaravati: రాష్ట్ర పోలీసు క్రీడాకారులను జాతీయస్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ‘ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ’ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ప్రకటించారు. క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణ, ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించి ప్రొఫెషనల్‌ స్థాయిలో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇందులో భాగంగా వీఐటీ–ఏపీ, అమరావతితో పోలీసుశాఖ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ లోగోను డీజీపీ ఆవిష్కరించారు.

మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో శుక్రవారం జరిగిన తొలి ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌–2026 ముగింపు కార్యక్రమంలో డీజీపీ మాట్లాడారు. పోలీసుశాఖలో హోదాలు, పోస్టింగ్‌లు వేరైనా అందరూ ఒకే జట్టులోని సభ్యులేనని పేర్కొన్నారు. ‘మనది ఏపీ పోలీస్‌ టీమ్‌.. మనమంతా ఒకే కుటుంబం. సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలం’ అని పిలుపునిచ్చారు.

1,900 మంది.. నాలుగు రోజుల క్రీడా సంబరం..

రాష్ట్రంలోని 15 విభాగాల నుంచి దాదాపు 1,900 మంది పోలీసు క్రీడాకారులు నాలుగు రోజులపాటు జరిగిన పోటీల్లో పాల్గొన్నారని డీజీపీ తెలిపారు. తొలిసారిగా ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. పతకాలు సాధించిన వారిని అభినందిస్తూ.. విజయం సాధించని వారు నిరుత్సాహపడకుండా మరింత సాధనతో ముందుకు సాగాలని సూచించారు. గెలుపు ఉత్సాహాన్నిస్తే.. ఓటమి పాఠం నేర్పుతుందని, రెండింటినీ సమానంగా స్వీకరించడమే క్రీడాస్ఫూర్తి అని పేర్కొన్నారు.

మారుతున్న నేరాలు.. పోలీసులకు ఫిట్‌నెస్‌ కీలకం..

సమాజంతోపాటు నేరాల స్వరూపమూ వేగంగా మారుతోందని డీజీపీ పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఎదురయ్యే కొత్త తరహా సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులకు శారీరక, మానసిక దృఢత్వం అత్యంత అవసరమన్నారు. క్రీడలను ఉద్యోగ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర పోలీసు క్రీడాకారులు ఈ మీట్‌తోనే ఆగిపోకుండా ఆల్‌ ఇండియా పోలీస్‌ గేమ్స్‌లో పతకాలు సాధించి ఆంధ్రప్రదేశ్‌కు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. వారికి ప్రభుత్వం, పోలీసుశాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మహిళా పోలీసులకు మరింత ప్రోత్సాహం..

ఈసారి రాష్ట్ర పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో మహిళా సిబ్బంది పాల్గొనడం కొత్త అధ్యాయానికి నాంది అని డీజీపీ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో మహిళలు ప్రతిభ చాటుతున్నారని, పోలీసుశాఖలోని మహిళా క్రీడాకారులు కూడా రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా పూర్తి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు.

స్పోర్ట్స్‌ మీట్‌ను విజయవంతంగా నిర్వహించిన ఆర్గనైజింగ్‌ కమిటీ, విశ్వవిద్యాలయాలు, క్రీడా సంస్థలు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, సిబ్బంది, క్రీడాకారులు, స్పాన్సర్లను డీజీపీ అభినందించారు. వచ్చే ఏడాది పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను మరింత విస్తృతంగా, మెరుగైన ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలిపారు.

విశాఖ రేంజ్‌కు ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌...

నాలుగు రోజులపాటు హోరాహోరీగా సాగిన పోటీల్లో విశాఖ రేంజ్‌ మహిళలు, పురుషుల విభాగాల్లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు ముగింపు కార్యక్రమంలో బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో ఐజీపీలు కె.వి.మోహన్‌రావు (స్పోర్ట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌), ఆకే రవికృష్ణ (ఈగల్‌), బి.రాజకుమారి (వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ), సీహెచ్‌.శ్రీకాంత్‌ (టెక్నికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఆపరేషన్స్‌), సెంథిల్‌కుమార్‌, ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌, డీఐజీలు అన్బురాజన్‌, వకుల్‌ జిందాల్‌తోపాటు పలువురు సీనియర్‌ పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

Perla Shyam Kumar, Staff Reporter -Vijayawada

మీడియా రంగంలో 28 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణంతో, ఎప్పటికప్పుడు తాజా పరిణామాలను క్షుణ్ణంగా విశ్లేషించే ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story