Amaravati: అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ విజన్

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 May 2026 4:33 PM IST
Amaravati
X

Amaravati: అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ విజన్

Amaravati: రాష్ట్ర రాజధాని అమరావతి మరో కీలక సాంకేతిక విప్లవానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భవిష్యత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయబోయే “క్వాంటం టెక్నాలజీ” రంగంలో దూసుకెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. “అమరావతి క్వాంటం వ్యాలీ” విజన్‌లో భాగంగా ప్రముఖ విద్యాసంస్థ జెప్పియార్ యూనివర్సిటీ, క్వాంటం ఏఐ గ్లోబల్ సంస్థలు కలిసి రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవడం విశేషంగా మారింది.

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్నను కలిసిన ప్రతినిధి బృందం ఏపీలో క్వాంటం ఎకోసిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రణాళికలను సమర్పించింది. ఈ భాగస్వామ్యం కేవలం విద్యా ఒప్పందాలకే పరిమితం కాకుండా భవిష్యత్ పారిశ్రామిక విప్లవానికి బ్లూప్రింట్‌గా నిలవబోతోందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు.

జెప్పియార్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ రెజీనా జె. మురళి నేతృత్వంలోని బృందం రూపొందించిన ప్రణాళికలో ప్రధానంగా “క్వాంటం అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్” స్థాపనకు ప్రాధాన్యత ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, సాంకేతిక విద్యా సంస్థలను అనుసంధానిస్తూ ఈ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం కమ్యూనికేషన్, క్వాంటం సెన్సింగ్ వంటి అత్యాధునిక రంగాల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించేలా హ్యాండ్స్-ఆన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

ఇక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కరికులంను రూపకల్పన చేయడం, అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం ద్వారా రాష్ట్ర యువతను గ్లోబల్ టెక్ మార్కెట్‌కు సిద్ధం చేయనున్నారు. దీని ద్వారా భవిష్యత్‌లో ప్రపంచ స్థాయి టెక్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు ఏపీ యువతకు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో అత్యంత కీలక అంశం అమరావతిని క్వాంటం హార్డ్‌వేర్ పరిశోధన మరియు తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే. క్వాంటం చిప్స్, సూపర్ కండక్టింగ్ సర్క్యూట్లు, క్వాంటం సెన్సార్ల తయారీకి అవసరమైన ప్రోటోటైపింగ్, టెస్టింగ్ మౌలిక సదుపాయాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇది భవిష్యత్‌లో “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” బ్రాండ్‌తో క్వాంటం టెక్నాలజీ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేసే అవకాశాన్ని కల్పించనుంది.

గత ఆరేళ్లుగా క్వాంటం రంగంలో లోతైన పరిశోధనలు చేస్తున్న క్వాంటం ఏఐ గ్లోబల్ సంస్థ కూడా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమరావతి అభివృద్ధికి వినియోగించనుంది. సంస్థ ఫౌండర్ మరియు సీఈఓ సంజయ్ చిట్టోరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, అమరావతికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యత ఈ ప్రాజెక్ట్ విజయానికి బలమవుతాయని తెలిపారు. దేశీయంగా క్వాంటం కంప్యూటింగ్ రంగంలో ఏపీని గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, పరిశ్రమల మధ్య బలమైన సమన్వయం కల్పించడం ద్వారా అమరావతిని అంతర్జాతీయ నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం ముందుకు సాగుతోంది. భవిష్యత్‌లో అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల గ్లోబల్ కేంద్రంగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ కీలక సమావేశంలో జెప్పియార్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మురళి సుబ్రమణియన్, ప్రో ఛాన్సలర్ డాక్టర్ షలీషా ఎ. స్టాన్లీ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ వెంకట జయకృష్ణ కిషోర్ సోంతి, రిజిస్ట్రార్ డాక్టర్ బిను శివ సింగ్ ఎస్.కె., క్వాకాడమీ సీఓఓ గోపిక చాగంటి తదితరులు పాల్గొన్నారు “క్వాంటం వ్యాలీ విజన్” కార్యరూపం దాల్చితే, ప్రపంచ క్వాంటం మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలవడం ఖాయమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story