Amaravati: అమరావతిలో రోడ్డు భద్రతకు కఠిన రూల్స్!
Amaravati: రాజధాని అమరావతిలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఏపీసీఆర్డీఏ (APCRDA) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Amaravati: అమరావతిలో రోడ్డు భద్రతకు కఠిన రూల్స్!
Amaravati: రాజధాని అమరావతిలో ఇటీవల చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఏపీసీఆర్డీఏ అప్రమత్తమైంది. ప్రమాదాలను పూర్తిగా నివారించి ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా కమిషనర్ వి. విజయరామరాజు కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ పోలీసులు, పీజీఎంసీ, ఏపీసీఆర్డీఏ వివిధ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్... తక్షణమే అమలు చేయాల్సిన చర్యలను ఖరారు చేశారు. వాటిలో భారీ వాహనాల వేగ నియంత్రణ నుంచి క్యూ ఆర్ కోడ్ ఆధారిత వాహనాల పర్యవేక్షణ వరకు పలు కీలక నిర్ణయాలు ఉన్నాయి.
అమరావతిలో రాజధాని నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో భారీ వాహనాల రాకపోకలు కూడా పెరిగాయి. దీంతో ప్రమాదాల అవకాశాలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఏపీసీఆర్డీఏ నిర్ణయించింది. అమరావతి పరిధిలో సంచరించే భారీ వాహనాల వేగాన్ని కట్టడి చేయడానికి పోలీస్ శాఖ గుంటూరు జిల్లా కలెక్టర్ సహకారంతో బ్యారికేడ్లు, స్పీడ్ గన్స్ ఏర్పాటు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. అలాగే ప్రధాన జంక్షన్ల వద్ద తగినంత ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనాల కదలికలను సమర్థంగా నియంత్రించాలని ఆదేశించారు.
రాజధాని నిర్మాణ పనుల్లో పాల్గొనే అన్ని భారీ వాహనాలు గంటకు 40 కిలోమీటర్లకు మించి వేగంతో వెళ్లకుండా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్టీఓ అధికారులకు సూచించారు. అలాగే ప్రతి వాహనానికి క్యూ ఆర్ కోడ్ ఆధారిత గుర్తింపు విధానాన్ని అమలు చేయనున్నారు. ఆ కోడ్ స్కాన్ చేస్తే వాహనం యాజమాన్యం, కాంట్రాక్టర్, డ్రైవర్ వివరాలు, ప్రయాణ మార్గం వంటి సమాచారం వెంటనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినా వెంటనే వాహనాన్ని గుర్తించే అవకాశం ఈ వ్యవస్థతో లభించనుంది.
అమరావతిలో పనిచేస్తున్న అన్ని కాంట్రాక్టు సంస్థలు తమ వాహనాలు ఏ మార్గాల్లో సంచరిస్తున్నాయో పూర్తి రూట్ మ్యాప్‌ను వెంటనే అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం మెటీరియల్ రవాణాకు ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ-3 రహదారి, సీడ్ యాక్సిస్ రోడ్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ఈ-8 రహదారిని ప్రత్యామ్నాయ మార్గంగా అభివృద్ధి చేసే ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. దీంతో నిర్మాణ వాహనాలు, సాధారణ వాహనాల రాకపోకలు వేర్వేరుగా ఉండి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు భారీ వాహనాల రాకపోకలను నిలిపివేయాలని పోలీసులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా స్థానికులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ప్రయాణించే ఈ సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతిలో అభివృద్ధి పనులు ఎంత వేగంగా సాగినా ప్రజల ప్రాణ భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్నదే ఏపీసీఆర్డీఏ లక్ష్యంగా కనిపిస్తోంది. వేగ నియంత్రణ, సాంకేతిక పర్యవేక్షణ, ప్రత్యామ్నాయ రహదారులు, సమయ పరిమితులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి చర్యలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని కమిషనర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. రాజధానిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని కల్పించేందుకు ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.




