Amaravati: ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజలు ఆందోళన వద్దు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం అప్రమత్తం. ప్యానిక్ కొనుగోళ్లతో రాష్ట్రవ్యాప్తంగా బంకుల వద్ద రద్దీ.
Amaravati: ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష.. ప్రజలు ఆందోళన వద్దు!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత ఒక్కసారిగా ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించగా, కొన్నిచోట్ల బంకులు పూర్తిగా మూతపడిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు సీఎస్ సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు...
రాష్ట్రంలో మొత్తం 4,510 పెట్రోల్ బంకులు ఉండగా, వాటిలో దాదాపు 421 బంకులు సరఫరా లేక మూతపడినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అంటే సుమారు 10 శాతం బంకులు కార్యకలాపాలు నిలిపివేసినట్టే. సాధారణంగా రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతాయి. అయితే కొరత వస్తుందనే ప్రచారంతో ప్రజలు ముందుగానే పెద్ద ఎత్తున కొనుగోళ్లు ప్రారంభించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది...
శనివారం ఒక్కరోజే 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు నమోదయ్యాయి. అంటే సాధారణ రోజులతో పోలిస్తే 50 శాతం కంటే ఎక్కువ డిమాండ్ పెరిగింది. ఈ ప్యానిక్ బాయింగ్ వల్ల సరఫరా పెరిగినా, నిల్వలు వెంటనే ఖాళీ అవుతున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ప్రజలు బారులు తీరడంతో బంకుల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది..
ఆక్వా రంగానికి సంబంధించిన వ్యాపారులు డ్రమ్‌లలో భారీగా ఇంధనం కొనుగోలు చేయడం మరో సమస్యగా మారింది. దీనివల్ల సాధారణ వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లు, ఫిషరీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యకు త్వరిత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు చేపట్టిన చర్యలపై సాయంత్రంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇంధన కొరతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్యానిక్ కొనుగోళ్లకు పోకుండా ప్రజలు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని దగ్గరగా పరిశీలిస్తూ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టింది.




