ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు...నవంబర్ 5న పోలింగ్.. 6న రీపోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు..
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 5కి వాయిదా. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు ఉంటుందని సవరించిన షెడ్యూల్ విడుదల చేసిన ఎస్ఈసీ.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు...నవంబర్ 5న పోలింగ్.. 6న రీపోలింగ్.. 7న ఓట్ల లెక్కింపు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. నవంబర్ 3న జరగాల్సిన పోలింగ్‌ను నవంబర్ 5కు వాయిదా వేసింది. అవసరమైతే నిర్వహించే రీపోలింగ్‌ను నవంబర్ 6న, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను నవంబర్ 7న చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా బుధవారం సవరించిన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.
పోలింగ్ సిబ్బంది కొరతతో మార్పులు
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించింది. పరిస్థితులను సమీక్షించిన అనంతరం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయాల్సిన అవసరం లేదని నిర్ణయించింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ను నవంబర్ 1న యథావిధిగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
అయితే, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 3న జరగనుండగా, అదే రోజు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. రెండు ఎన్నికల ప్రక్రియలను ఒకేసారి సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీసు, పోలింగ్ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను సవరించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
సవరించిన ఎన్నికల షెడ్యూల్ ఇలా..
రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ నం. 905/SEC-B1/2026 ప్రకారం.. నవంబర్ 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అవసరమైన చోట నవంబర్ 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ చేపడతారు. నవంబర్ 7న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు.
ఇప్పటికే ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 27న మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రచురించారు. అదే రోజు ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల ఫలితాలను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో షెడ్యూల్లో చేసిన మార్పులను అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, ఓటర్లు గమనించాలని ఎన్నికల సంఘం సూచించింది.
88 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగింపు
అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లోని మొత్తం 88 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగింపు సమయాన్ని ఎన్నికల సంఘం ముందుగానే నిర్ణయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లో 44 పోలింగ్ కేంద్రాలు, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో 44 పోలింగ్ కేంద్రాలు కలిపి మొత్తం 88 కేంద్రాల్లో పోలింగ్ సమయం మధ్యాహ్నం 3 గంటలకే ముగియనుంది. అవసరమైతే ఈ కేంద్రాల్లో రీపోలింగ్ కూడా మధ్యాహ్నం 3 గంటలకే ముగుస్తుంది.
ఈ మేరకు అక్టోబర్ 20న జారీ చేసిన నోటిఫికేషన్లలో పేర్కొన్న ప్రత్యేక పోలింగ్ సమయాలు యథావిధిగా అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సవరించిన ఎన్నికల షెడ్యూల్‌పై అన్ని జిల్లాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించింది.




