AP: మన సభ - జన సభ'కు భారీ సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు!
AP: ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాల నిర్వహణ, డిజిటల్ పాస్‌ల విధానం, భద్రతపై స్పీకర్, చైర్మన్ మోషేను ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
AP: మన సభ - జన సభ'కు భారీ సమావేశాలకు పటిష్ట ఏర్పాట్లు!
AP: ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసన మండలి, శాసన సభ సమావేశాలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చింతకాయల అధికారులను ఆదేశించారు.
సభా నిర్వహణ, పరిపాలనా అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతిభద్రతలు, పోలీస్ బందోబస్తుపై శుక్రవారం అమరావతిలో అధికారులతో వారు సమీక్షలు నిర్వహించారు. సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్) ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, అదనపు డీజీపీ మధుసూదన రెడ్డితో వేర్వేరుగా సమావేశమై పలు సూచనలు చేశారు.
పెండింగ్ ప్రశ్నలకు ఇక జాప్యం వద్దు
సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో స్పష్టమైన, పూర్తి సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని స్పీకర్లు సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రశ్నలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సంబంధిత శాఖల నుంచి సమాధానాలు సకాలంలో వచ్చేలా సమన్వయ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
సమాధానం ఇవ్వడం సాధ్యం కాని ప్రశ్నల విషయంలో కారణాలను స్పష్టంగా పేర్కొంటూ సంక్షిప్త సమాధానం ఇవ్వాలని సూచించారు. పాత పెండింగ్ ప్రశ్నలను పూర్తిస్థాయిలో సమీక్షించి, నిబంధనల ప్రకారం పరిష్కరించాల్సిన వాటిని పరిష్కరించాలని, అవసరమైన చోట పెండింగ్ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాలని చెప్పారు.
సభా హామీల అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ
సభలో మంత్రులు, శాఖల తరఫున ఇచ్చే హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నిర్ణీత వ్యవధిలో అమలయ్యేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హామీల అమలు స్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.
సభ్యుల వైద్య బిల్లులకు వేగంగా పరిష్కారం
సభ్యులకు సంబంధించిన సంక్షేమ అంశాల్లో భాగంగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని స్పీకర్లు స్పష్టం చేశారు. అర్హత ఉన్న క్లెయిమ్‌లను ఎలాంటి అనవసర జాప్యం లేకుండా పరిష్కరించాలని, పరిపాలనా లేదా సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వాటిని వెంటనే అధిగమించాలని సూచించారు.
పింఛను పెంపు ప్రతిపాదనలపై త్వరిత నిర్ణయం
సభ్యుల పింఛను పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా వేగంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రతిపాదనల ప్రస్తుత స్థితి, పరిపాలనా ప్రక్రియ, ఆర్థిక అంశాలను సమీక్షించి వీలైనంత త్వరగా తగిన నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
డిజిటల్ పాస్ ఉంటేనే ప్రవేశం
సభా సమావేశాల సందర్భంగా ఈసారి అమలు చేస్తున్న డిజిటల్ పాస్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రవేశించే ప్రతి వ్యక్తి పాస్‌ను తప్పనిసరిగా స్కాన్ చేసి, ధ్రువీకరణ పూర్తయిన తర్వాతే సభా ప్రాంగణంలోకి అనుమతించాలని స్పష్టం చేశారు.
స్కానింగ్, పాస్ వెరిఫికేషన్ విధానంపై భద్రతా సిబ్బందికి ముందుగానే శిక్షణ, అవగాహన కల్పించాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా అనుమతించబడిన వ్యక్తులకే ప్రవేశం కల్పించేలా ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.
‘మన సభ – జన సభ’కు అదనపు భద్రత
నేడు, రేపు నిర్వహించనున్న ‘మన సభ – జన సభ’ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి సందర్శకులకు సభా ప్రాంగణాలను సందర్శించే అవకాశం ఉన్నందున ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.
సందర్శకుల ప్రవేశం, డిజిటల్ పాస్‌ల తనిఖీ, వాహనాల రాకపోకలు, పార్కింగ్, భద్రతా తనిఖీలపై ముందుగానే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. సందర్శకులకు ఇబ్బందులు లేకుండా, భద్రతలో రాజీ లేకుండా ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.
భద్రతా లోపాలకు తావులేకుండా చర్యలు
గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లలో ఉన్న లోపాలు, గ్యాప్‌లను ముందుగానే గుర్తించి సరిచేయాలని పోలీస్ అధికారులను స్పీకర్ ఆదేశించారు. సచివాలయం చుట్టూ విస్తారమైన ఖాళీ ప్రాంతాలు ఉన్నందున వాటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.
నాలుగు వైపులా పటిష్ట నిఘా
సచివాలయం, శాసన మండలి, శాసన సభ ప్రాంగణాల చుట్టూ నాలుగు వైపులా బందోబస్తును బలోపేతం చేయాలని తెలిపారు. సీసీటీవీ కెమెరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు.
విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సంభవించే సమస్యలను ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.
భద్రతతో పాటు రాకపోకలకు ఇబ్బంది లేకుండా
సభా సమావేశాల సమయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సందర్శకుల రాకపోకలకు అంతరాయం కలగకుండా సమన్వయంతో విధులు నిర్వహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. అదే సమయంలో భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.
అధికారుల సమీక్ష సమావేశం
సమావేశాల్లో శాసన సభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామ కృష్ణరాజు, శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, సీఎం సెక్యూరిటీ ఎస్పీ భద్రయ్య, జాయింట్ సెక్రటరీ విజయరాజు, డిప్యూటీ సెక్రటరీ వనితా రాణి తదితరులు పాల్గొన్నారు.




