Amaravati: ఏపీలో ఆటో మ్యుటేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం!
Amaravati: ఆస్తుల రిజిస్ట్రేషన్ కాగానే మున్సిపల్ రికార్డుల్లో నేరుగా పేరు మార్పు. ఏపీ పురపాలక శాసనముల సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం.
Amaravati: ఏపీలో ఆటో మ్యుటేషన్ బిల్లుకు శాసనసభ ఆమోదం!
Amaravati: ఆస్తుల రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ రికార్డుల్లో యజమాని పేరు మార్పు ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల మూడో సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా.. స్వల్ప చర్చ అనంతరం సభ్యులు ఆమోదించారు.
ప్రస్తుతం ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత.. కొత్త యజమాని పేరు మున్సిపల్ రికార్డుల్లో నమోదు చేయించేందుకు ప్రత్యేకంగా మ్యుటేషన్ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోంది. దీనివల్ల ఆస్తి యజమానులు మరోసారి మున్సిపల్ కార్యాలయాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దరఖాస్తులు, పత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు వంటి ప్రక్రియలు పూర్తయ్యే వరకు రికార్డుల్లో పేరు మార్పు ఆలస్యమవుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం ఆటోమ్యుటేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి చట్టపరమైన మార్పులు చేసింది. ఇకపై ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే ఆ వివరాలను మున్సిపల్ రికార్డులతో అనుసంధానం చేయనున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే కొత్త యజమాని వివరాలు మున్సిపల్ రికార్డుల్లోనూ నమోదయ్యేలా వ్యవస్థను రూపొందిస్తున్నారు.
మ్యుటేషన్ కోసం ప్రత్యేకంగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజు చెల్లించేలా చట్టంలో సవరణలు చేశారు. తద్వారా ఆస్తి బదలాయింపు ప్రక్రియలో ఒక కీలకమైన దశను ప్రభుత్వం తొలగించనుంది.
అదే సమయంలో కార్పొరేషన్లు, వివిధ గ్రేడ్‌ల మున్సిపాలిటీల్లో మ్యుటేషన్‌కు ప్రస్తుతం ఉన్న విధానాల్లో భిన్నత్వాన్ని తొలగించి ఏకీకృత ఫీజుల విధానాన్ని అమలు చేసేందుకు కూడా సవరణలు చేశారు.
కొత్త విధానం అమల్లోకి వస్తే ఆస్తి రిజిస్ట్రేషన్ నుంచి మున్సిపల్ రికార్డుల్లో యాజమాన్య మార్పు వరకు ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తయ్యే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్, మున్సిపల్ రికార్డుల మధ్య సమన్వయం పెరగడంతో రికార్డుల నిర్వహణలోనూ సాంకేతికతకు పెద్దపీట పడనుంది. మొత్తంగా ఆస్తి యజమానులకు సులభతర సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చట్ట సవరణలు చేపట్టింది.




