Amaravati: స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్’కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Amaravati: ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయం. కిడ్నీ రోగుల కోసం దేశంలోనే వినూత్నమైన "స్వాప్ డొనేషన్" (పరస్పర మార్పిడి) విధానానికి చట్టబద్ధత.

Hari Kishan  AP Bureau Chief
Published on: 4 Jun 2026 8:27 PM IST
Amaravati
X

Amaravati: స్వాప్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్’కు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Amaravati: కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వేలాది మంది రోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుంచి మాత్రమే కిడ్నీ దానం పొందే అవకాశం ఉండగా, ఇకపై "పరస్పర మార్పిడి" లేదా "స్వాప్ డొనేషన్" విధానానికి చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో ఒక కుటుంబంలోని దాత కిడ్నీ మరో కుటుంబంలోని రోగికి సరిపోతే, అదే సమయంలో ఆ కుటుంబంలోని దాత కిడ్నీ మొదటి కుటుంబ రోగికి సరిపోతే పరస్పరం మార్పిడి చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ నిర్ణయం వల్ల చికిత్స కోసం ఎదురుచూస్తున్న అనేక మంది కిడ్నీ రోగులకు కొత్త జీవితం లభించే అవకాశాలు పెరిగాయి.

ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తల్లిదండ్రులు, పిల్లలు వంటి సమీప కుటుంబ సభ్యుల నుంచే కిడ్నీ మార్పిడి చేసుకునే వీలుండేది. అయితే చాలా సందర్భాల్లో రోగి, దాతల బ్లడ్ గ్రూపులు సరిపోకపోవడం, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉండటం వంటి కారణాలతో శస్త్రచికిత్సలు సాధ్యం కావడం లేదు. ఫలితంగా దాత సిద్ధంగా ఉన్నా రోగి కిడ్నీ పొందలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యాక్ట్–2011లోని స్వాప్ డొనేషన్ విధానాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి త్వరలో ఆర్డినెన్స్, తదనంతరం పూర్తి స్థాయి నిబంధనలు జారీ కానున్నాయి.

తాజా నిర్ణయంలో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఇప్పటి వరకు తల్లిదండ్రులు లేదా పిల్లల నుంచే కిడ్నీ, కాలేయ దానం పొందే అవకాశం ఉండగా, ఇకపై తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు కూడా అవయవ దాతల జాబితాలో చేరనున్నారు. ముఖ్యంగా చిన్నారుల చికిత్సలో ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడనుంది. అలాగే కార్నియా, నర్వ్, టెండాన్, స్కిన్ వంటి వాటిని ప్రత్యేకంగా "టిష్యూ" జాబితాలో చేర్చుతూ సాంకేతిక మార్పులు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం జీవన్‌దాన్ ట్రస్ట్ వద్ద కిడ్నీ కోసం 3,634 మంది రోగులు నమోదు చేసుకుని ఎదురు చూస్తున్నారు. వారికి ఈ నిర్ణయం కొంత మేర ఊరటనిచ్చే అవకాశం ఉంది.

అవయవ దానాన్ని ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గత రెండేళ్లలో 209 మంది జీవన్మృతులు మొత్తం 663 అవయవాలను దానం చేసినట్లు వెల్లడించారు. అవయవ దానం చేసిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 వేల ప్రోత్సాహక నగదు అందించడంతో పాటు, దాతలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తోంది. తాజాగా తీసుకున్న స్వాప్ డొనేషన్ నిర్ణయం కూడా అవయవ దాన వ్యవస్థను మరింత బలోపేతం చేసి, కిడ్నీ రోగులకు కొత్త ఆశను అందించనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story