Amaravati: మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్..కీలక బిల్లులకు ఆమోదం?

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. అమరావతిలో 6,212 ఎకరాల భూసమీకరణ, రైతులకు మద్దతు ధర, అభివృద్ధి పనులపై కీలక చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 3 Sept 2026 10:55 AM IST
Amaravati
X

Amaravati: మరికాసేపట్లో ఏపీ క్యాబినెట్..కీలక బిల్లులకు ఆమోదం?

Amaravati: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మరికాసేపట్లో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. 25కి పైగా అంశాలతో జరగనున్న ఈ భేటీలో అమరావతి రాజధాని అభివృద్ధి, రైతులకు సంబంధించిన నిర్ణయాలు, వివిధ జిల్లాల్లో అభివృద్ధి పనులు, న్యాయశాఖ, పరిశ్రమలు, వైద్య రంగానికి సంబంధించిన పలు ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించనుంది.

అమరావతిలో మరో భారీ స్థాయిలో 6,212.50 ఎకరాల భూసమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రతిపాదిత రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, గ్రిడ్ రోడ్ల విస్తరణ కోసం ఈ భూములను సమీకరించనున్నారు. కంతేరు గ్రామంలో 974 ఎకరాలు, తాడికొండ గ్రామంలో 5,238.50 ఎకరాలు కలిపి మొత్తం 6,212.50 ఎకరాల భూమిని సమీకరించే ప్రతిపాదన ఉంది.

అమరావతి కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేలా ఎర్రుపాలెం–నంబూరు మీదుగా కొత్త బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ ప్రతిపాదనకు అనుగుణంగా భూసమీకరణ చేపట్టనున్నారు. రైల్వే లైన్‌కు ఇరువైపులా 50 మీటర్ల చొప్పున, మొత్తం 100 మీటర్ల బఫర్ పరిధిలో భూములను సమీకరించేందుకు ప్రతిపాదించారు. రైతుల విజ్ఞప్తుల మేరకు ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు గ్రిడ్ రోడ్ల విస్తరణకు అవసరమైన భూముల సమీకరణపైనా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాజధాని ప్రాంతంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రహదారుల నెట్‌వర్క్‌ను విస్తరించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి.

శాఖమూరులో రూ.759.79 కోట్లతో అమరావతి సంగమం ఏర్పాటు ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుకు రానుంది. రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, సుపరిపాలన సంస్థలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం డీపీఎల్ నుంచి రూ.310.08 కోట్లు, ఏపీహెచ్ఆర్‌డీఐ నుంచి రూ.277.94 కోట్లు, ఏపీ సీఆర్‌డీఏ నుంచి రూ.171.76 కోట్లు సమకూర్చే ప్రతిపాదన ఉంది.

అమరావతి ఎల్పీఎస్ రోడ్ల నిర్మాణంలోనూ మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రతిపాదించిన సిమెంట్ కాంక్రీట్ రోడ్లకు బదులుగా బిటుమినస్ రోడ్లను నిర్మించే ప్రతిపాదనపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. నిర్మాణ వ్యయం, నిర్వహణ, రహదారుల వినియోగ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అమరావతి రాజధాని నగరంలో కొత్త భూ కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీనికి సంబంధించి మంత్రుల బృందం చేసిన సిఫార్సులను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధానిలో ప్రభుత్వ, ప్రజా అవసరాలకు భూముల వినియోగంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

రైతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోనుంది. తోతాపురి మామిడి రైతులకు రూ.281 కోట్ల మద్దతు ధర నిధులు అందించేందుకు ప్రతిపాదించారు. మార్క్‌ఫెడ్ ద్వారా స్వల్పకాలిక రుణాలు అందించే అంశానికి కూడా కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. మార్కెట్ ధరలు ఆశించిన స్థాయిలో లేని సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.

పొగాకు రైతులకు రూ.94 కోట్ల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదన కూడా కేబినెట్ ముందుంది. మార్క్‌ఫెడ్ ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే విధానంపై నిర్ణయం తీసుకోనున్నారు.

వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 78 వరద నష్టం పనులకు రూ.6.25 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులను తిరిగి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు.

వెలిగొండ టన్నెల్–2 వద్ద బోరింగ్ యంత్రం తొలగింపునకు రూ.11.63 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనను కూడా కేబినెట్ పరిశీలించనుంది. ఈ పనిని మేఘా ఇంజినీరింగ్‌కు అదనపు పనిగా అప్పగించే అంశానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

న్యాయశాఖకు సంబంధించి మంగళగిరి అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి కోర్టుకు 21 పోస్టులు మంజూరు చేసే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. న్యాయస్థానంలో అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం ద్వారా కోర్టు కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించే అవకాశం ఉంటుంది.

రాజమహేంద్రవరం ఈఎస్ఐ ఆసుపత్రి ఆధునీకరణ ప్రతిపాదనపైనా మంత్రివర్గం చర్చించనుంది. ఆసుపత్రిలో వైద్య సేవలు, మౌలిక వసతులను మెరుగుపరిచే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మార్కాపురంలో కొత్త సమీకృత కలెక్టరేట్ సముదాయం కోసం 20.01 ఎకరాల భూమిని బదలాయించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఒకే చోట వివిధ ప్రభుత్వ శాఖలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందేలా సమీకృత కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

విజయవాడ గ్రామీణ మండలం వేమవరంలో జెట్ సిటీలో పరిశ్రమల సముదాయం కోసం 10.12 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు అంశం కూడా కేబినెట్ అజెండాలో ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా స్థానికంగా పారిశ్రామిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ఈ ప్రతిపాదన ఉండనుంది.

ఈరోజు కేబినెట్‌లో అమరావతి భూసమీకరణ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, గ్రిడ్ రోడ్లు, అమరావతి సంగమం, ఎల్పీఎస్ రోడ్లు, కొత్త భూ కేటాయింపులతో పాటు రైతులకు ఆర్థిక సాయం, వరద నష్టం పునరుద్ధరణ, వెలిగొండ పనులు, న్యాయ, వైద్య, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story