పవన్ కళ్యాణ్‌పై విమర్శలు.. స్పందించిన చంద్రబాబు
Chandrababu Naidu: తెలంగాణలో పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న రాజకీయ విమర్శల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.
పవన్ కళ్యాణ్‌పై విమర్శలు.. స్పందించిన చంద్రబాబు
Chandrababu Naidu: తెలంగాణలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వివిధ రాజకీయ పార్టీల నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు మంచి రాజకీయ సంస్కృతి కాదని, అనవసరంగా కొత్త వివాదాలకు తెరలేపే ప్రయత్నాలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపు 12 సంవత్సరాలు పూర్తయ్యాయని, రెండు రాష్ట్రాలు తమ తమ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎవరికీ ఉపయోగపడదన్నారు..
తెలంగాణలోని కొందరు నాయకులు గత అంశాలను మళ్లీ తెరపైకి తీసుకువస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతానికి ఎవరు సేవ చేశారో, ఎవరు అభివృద్ధికి కృషి చేశారో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తారని, కాబట్టి అనవసర ఆరోపణలు లేదా ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఫలించవని పేర్కొన్నారు.
దేశ రాజకీయాల్లో ప్రాంతాల మధ్య సహకారం, పరస్పర గౌరవం ఎంతో అవసరమని చంద్రబాబు అన్నారు. ఇటీవల తాను తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేస్తూ, అక్కడ వివిధ రాష్ట్రాల నాయకులు కలిసి ప్రచారం చేశారని చెప్పారు. కర్నాటకకు చెందిన నేతలు కూడా తమిళనాడులో ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రజాస్వామ్యంలో ఇది సహజ ప్రక్రియ అని వివరించారు. ఒక రాష్ట్ర నాయకుడు మరో రాష్ట్రంలో రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం అసాధారణ విషయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు..
అదే సమయంలో తెలంగాణ రాజకీయ పరిస్థితులను కూడా ప్రస్తావించిన చంద్రబాబు, అక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు భారత రాష్ట్ర సమితి కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ గతంలో జాతీయ పార్టీగా విస్తరిస్తామని ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కార్యకలాపాలు ప్రారంభించిందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రాంతీయతను ప్రస్తావిస్తూ విమర్శలు చేయడం ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో విస్తరణ, ప్రజా మద్దతు కోసం ప్రయత్నించడం ప్రతి పార్టీ హక్కేనని ఆయన పేర్కొన్నారు..
ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు కీలక స్థానాల్లో ఉన్నారని చంద్రబాబు అన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి దేశాల్లో తెలుగువారు ఉన్నత పదవులు చేపట్టి సేవలందిస్తున్నారని చెప్పారు. వారు అక్కడి రాజ్యాంగ వ్యవస్థల ప్రకారం పనిచేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందుతున్నారని వివరించారు. ప్రజలకు మంచి సేవలు అందించే వారే నాయకులుగా ఎదుగుతారని ఆయన అన్నారు.
చివరగా రాజకీయ పార్టీలు, నాయకులు పరస్పర విమర్శల కంటే అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మెరుగైన పరిపాలనలో పోటీ పడాలని చంద్రబాబు సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయడం రాజకీయాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాల కంటే అభివృద్ధి రాజకీయాలే దేశానికి, రాష్ట్రాలకు మేలు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.




