అర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనాలు వేగవంతం చేయాలి..విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

Amaravati: అమరావతి ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి 'అర్నాబ్' తుఫాన్ పరిస్థితులపై సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమీక్ష. విద్యుత్, రోడ్ల పునరుద్ధరణకు ఆదేశం, పంట నష్టాల పక్కా గణన.

Hari Kishan  AP Bureau Chief
Published on: 28 Oct 2026 5:28 PM IST
Amaravati
X

అర్నబ్ తుఫాన్ నష్టంపై అంచనాలు వేగవంతం చేయాలి..విద్యుత్, రహదారుల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

అమరావతి: అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడంతోపాటు విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్) కేంద్రం నుంచి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలు, వివిధ శాఖలు చేపడుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లతో మరోసారి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల వారీగా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడంతోపాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని స్పష్టం చేశారు.

సమీక్షలో భాగంగా ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం, జిల్లాల వారీగా తుఫాన్ ప్రభావం, దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు, సహాయక చర్యల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కోనసీమ జిల్లాలో సుమారు 33 వేల కొబ్బరి చెట్లు పడిపోయినట్లు తెలిపారు. ఇదే జిల్లాలో సుమారు 10 వేల ఇతర చెట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 4 వేల చెట్లు కూలిపోయినట్లు వివరించారు. కూలిన చెట్ల కారణంగా రహదారులపై రాకపోకలకు ఏర్పడిన అంతరాయాలను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

జాతీయ రహదారి-16పై కూలిన చెట్లను ఇప్పటికే తొలగించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇతర ప్రాంతాల్లో చెట్ల తొలగింపు పనులను మధ్యాహ్నం 3 గంటల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు. అయితే, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, రహదారులపై అడ్డంకుల తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరగకుండా అవసరమైన సిబ్బందిని అదనంగా అందుబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ఏపీసీపీడీసీఎల్ నుంచి కూడా సిబ్బందిని పంపించి సహాయక చర్యలకు సహకరించాలని సూచించారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలన్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కూలిన చెట్లను తొలగించి సాయంత్రానికి అన్ని జిల్లాల్లో రహదారులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు కలిగించే అడ్డంకులను కూడా తొలగించాలన్నారు. తుఫాన్ అనంతరం పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజారోగ్యానికి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

మరోవైపు, తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై సమగ్ర అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలన్నారు. పశుసంపద నష్టం, ఇళ్లు కూలిపోవడం, నీట మునగడం వల్ల కలిగిన నష్టాన్ని కూడా నమోదు చేయాలని సూచించారు. విద్యుత్ వ్యవస్థలు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాన్ని గుర్తించడంతోపాటు చెరువులకు గండ్లు పడిన ప్రాంతాల వివరాలను సేకరించాలని ఆదేశించారు. నష్టం అంచనాల్లో వాస్తవ పరిస్థితులకు ప్రాధాన్యత ఇవ్వాలని, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించాలని స్పష్టం చేశారు.

రిజర్వాయర్లలోకి వస్తున్న నీటి ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. వర్షపాతం, నీటి ప్రవాహాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సీసీటీవీ కెమెరాలు, అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించి పరిస్థితులను పర్యవేక్షించాలని, వరద నీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశాలు ఉన్న చోట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు తాగునీరు, విద్యుత్ సరఫరా, రవాణా సదుపాయాల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే విషయంలో గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ వ్యవస్థలను మరింత సమర్థంగా పనిచేయించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పదేళ్లలో రాష్ట్రాన్ని 26 తుఫాన్లు ప్రభావితం చేశాయని గుర్తుచేశారు. గతంలో దివిసీమ ఉప్పెన సమయంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని, హుద్‌హుద్‌, తిత్లీ వంటి తుఫాన్లు కూడా పెనుగాలులతో తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెప్పారు. గతంలో వరదల నిర్వహణలో ఎదురైన వైఫల్యాలను ప్రస్తావిస్తూ, విపత్తుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో, వేగంగా స్పందించడం అత్యంత కీలకమని అన్నారు.

బుడమేరు వరదల సమయంలో విజయవాడలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తూ వ్యవస్థలను గాడిలో పెట్టగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం అర్నబ్ తుఫాన్ సమయంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచినప్పటికీ, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రాణ, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి విపత్తు నుంచి నేర్చుకున్న అనుభవాలను తదుపరి సందర్భాల్లో ఉపయోగించుకోవాలని, ముందస్తు హెచ్చరికల నుంచి సహాయక చర్యల వరకు ప్రతి దశలోనూ సమర్థమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

అన్ని స్థాయుల్లోని అధికారులు ఒకే విధమైన ఆలోచనతో పనిచేయాలని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు చేరవేయడంతోపాటు, తీసుకున్న నిర్ణయాలు అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా అవసరమైన సహాయాన్ని అందించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

అర్నబ్ తుఫాన్ ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు, నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని చంద్రబాబు తెలిపారు. తుఫాన్ అనంతర పరిస్థితుల్లోనూ అదే అప్రమత్తతను కొనసాగించాలని అధికారులకు సూచించారు. గత రాత్రి నుంచి ఇప్పటివరకు నాలుగు సార్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి తుఫాన్ పరిస్థితులు, సహాయక చర్యలను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించే వరకు అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.