తుఫాన్ల నష్టంపై కేంద్రానికి సీఎం లేఖ

Amaravati: వరుస తుఫాన్లతో ఎపిలో తీవ్ర నష్టం. మురసు తుఫానుతో రూ. 1,919.59 కోట్లు నష్టం వాటిల్లిందని, కేంద్రం తక్షణ సాయం అందించాలని అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 6 Nov 2026 8:22 PM IST
Amaravati
X

తుఫాన్ల నష్టంపై కేంద్రానికి సీఎం లేఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుఫాన్లు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండు తుఫాన్లు రాష్ట్రంపై ప్రభావం చూపడంతో వ్యవసాయ, ఉద్యానవన రంగాలతో పాటు మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ రాశారు. మురసు తుఫాన్‌ కారణంగా రాష్ట్రానికి ప్రాథమికంగా 1,919 కోట్ల 59 లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపిందని వివరించారు.

మురసు తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా 1,43,122 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని, 1,86,063 మంది రైతులు నష్టపోయారని ముఖ్యమంత్రి వెల్లడించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి 874 కోట్ల 96 లక్షల రూపాయల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. ఉద్యాన పంటలకు కూడా భారీ నష్టం వాటిల్లిందని, ఈ రంగంలో 337 కోట్ల 10 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు లేఖలో ప్రస్తావించారు. చేతికొచ్చే సమయంలో పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

వ్యవసాయ రంగంతో పాటు రాష్ట్రంలోని ఇతర కీలక రంగాలపైనా తుఫాన్‌ ప్రభావం పడిందని చంద్రబాబు వివరించారు. విద్యుత్‌ వ్యవస్థ, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీరాజ్‌ వ్యవస్థతో పాటు విద్య, వైద్యారోగ్య రంగాల్లోనూ నష్టం వాటిల్లిందని తెలిపారు. తుఫాన్‌ కారణంగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంతో పాటు సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు.

ఇప్పటికే అర్నబ్ తుఫాన్‌ కారణంగా జరిగిన నష్టం నుంచి రాష్ట్రం పూర్తిగా కోలుకోకముందే మరోసారి మురసు తుఫాన్‌ రూపంలో విపత్తు ఎదురైందని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. ఒకే సీజన్‌లో వరుసగా రెండు తుఫాన్లు ప్రభావం చూపడంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కేంద్రానికి వివరించారు.

ఈ నేపథ్యంలో తుఫాన్‌ బాధిత రైతులు, మత్స్యకారులతో పాటు నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. బాధితులకు ఊరట కల్పించేలా తక్షణ మధ్యంతర ఆర్థిక సాయం అందించాలని అమిత్‌ షాను కోరారు. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం తగిన సహకారం అందించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసినట్లు చంద్రబాబు తెలిపారు. క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ కొనసాగుతోందని, మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. తుది నివేదికలో నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు, పునరుద్ధరణకు అవసరమైన నిధుల వివరాలను పొందుపరచనున్నారు.

వరుస తుఫాన్లతో నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు సకాలంలో ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహకారం కోరుతోంది. మరి రాష్ట్రం సమర్పించనున్న తుది నష్ట నివేదిక ఆధారంగా కేంద్రం ఎలాంటి ఆర్థిక సాయం ప్రకటిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.