Pawan Kalyan: ఆక్వా కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం!

Pawan Kalyan: ఆక్వా వ్యర్థాలతో నీటి వనరులు కలుషితమైతే సహించం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక ప్రతీ 15 రోజులకు ప్రాసెసింగ్ యూనిట్లలో తనిఖీలకు ఆదేశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Oct 2026 4:40 PM IST
Pawan Kalyan
X

Pawan Kalyan: ఆక్వా కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం!

Pawan Kalyan: ఆక్వా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో సహజ నీటి వనరులు కలుషితం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పర్యావరణానికి, ప్రజలకు హాని కలిగించే చర్యలు ఆమోదయోగ్యం కాదన్నారు.

మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లలో పర్యావరణ నిబంధనల అమలుపై సీ ఫుడ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా ప్రాసెసింగ్, ప్రీ-ప్రాసెసింగ్ యూనిట్లు 128 ఉన్నాయని అధికారులు వివరించారు. వీటిలో 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ నివేదిక సమర్పించారు.

పరీక్షల్లో 49 యూనిట్లు నిర్దేశిత ప్రమాణాలను పాటించడం లేదని తేలింది. ముఖ్యంగా బీఓడీ స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం లీటరు నీటిలో బీఓడీ 30 మిల్లీగ్రాములకు మించకూడదు. అయితే కొన్ని యూనిట్లలో 321 మిల్లీగ్రాముల వరకు నమోదైనట్లు తెలిపారు. సుమారు 64 శాతం యూనిట్లలో బీఓడీ స్థాయిలు 90 మిల్లీగ్రాములకు మించి ఉన్నట్లు వివరించారు.

అదేవిధంగా టీఎస్ఎస్ స్థాయిలు కూడా అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం టీఎస్ఎస్ లీటరుకు 50 మిల్లీగ్రాములకు మించకూడదు. అయితే కొన్ని యూనిట్లలో 365 మిల్లీగ్రాముల వరకు నమోదైనట్లు తెలిపారు. ఇటువంటి పరిస్థితులు నీటి వనరులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

ఈ వివరాలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ఇంత యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘనను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని మూలం వద్దే నియంత్రించడం అత్యంత కీలకమన్నారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి వెలువడే మురుగునీరు నదులు, కాలువలు, చెరువులు, సముద్ర సంగమ ప్రాంతాలు, భూగర్భ జలాలను కలుషితం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం, సహజ జలవనరులను కాపాడటం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు. నీటి వనరులపై ప్రజల జీవనాధారం, వ్యవసాయం, మత్స్య సంపద ఆధారపడి ఉన్నాయని తెలిపారు. ప్రతి ఆక్వా పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లలో పర్యావరణ ప్రమాణాల అమలును ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని సూచించారు. నిబంధనల అమలులో సాంకేతిక లేదా నిర్వహణపరమైన సమస్యలు ఉంటే పరిశ్రమల ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను పరిశీలిస్తామని చెప్పారు.

మత్స్యకారులు, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించి సమస్యలను సమగ్రంగా చర్చించాలని సూచించారు. పారిశ్రామిక అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణ మధ్య సమతుల్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.