AP: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్: మంత్రి నారా లోకేష్!
AP: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదల మంత్రి నారా లోకేష్ ఆదేశం 10వ తరగతి కోసం 'మిషన్ మార్చ్', వర్సిటీల్లో 1,523 పోస్టుల భర్తీ, 175 లీప్ స్కూల్స్ ఏర్పాటు.
AP: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్: మంత్రి నారా లోకేష్!
AP: డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌ను నెల రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక అంశాలపై మంత్రి చర్చించారు. నోటిఫికేషన్ విడుదల నుంచి అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న రిక్రూట్మెంట్ విధానాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలిస్తున్నాయని లోకేష్ పేర్కొన్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ‘మిషన్ మార్చ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడంతో పాటు పరీక్షల ఫలితాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
స్కూల్ డ్రాపౌట్స్ నివారణపై కూడా మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల తిరుపతి పర్యటనలో సింగపూర్ హోం మంత్రి షణ్ముగం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని డ్రాపౌట్స్ నివారణకు చర్యలు చేపట్టాలని అన్నారు. బడి మానేసే పిల్లలు భవిష్యత్తులో డ్రగ్స్ సహా పలు సామాజిక సమస్యల బారినపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కమ్యూనిటీ లీడర్లను భాగస్వాములను చేసి ‘జీరో డ్రాప్ అవుట్ మిషన్’ చేపట్టాలని సూచించారు. యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దిన నిడమర్రు పాఠశాలను సందర్శించేందుకు సింగపూర్ మంత్రి షణ్ముగంను త్వరలో ఆహ్వానిస్తామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 పాఠశాలలను గుర్తించి ‘లీప్ స్కూల్స్’గా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యాశాఖలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు విధివిధానాలపై కూడా సమీక్షించారు.
వివిధ యూనివర్సిటీల పరిధిలో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేయాలని లోకేష్ ఆదేశించారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిందని, డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో క్యాంపస్‌ల ఏర్పాటుకు జేఎస్ఎస్, థాపర్, యూపీఈఎస్, జేయూఎస్, బెన్నెట్, సవిత యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థల క్యాంపస్‌లకు అవసరమైన భూమిని గుర్తించి నిర్మాణాలు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
SALT (Supporting Andhra's Learning Transformation) కార్యక్రమం అమలుపైనా సమీక్ష జరిగింది. డిసెంబర్ నాటికి తొలి విడత పూర్తవుతున్నందున రెండో విడత కోసం సంబంధిత సంస్థలతో సంప్రదింపులు జరపాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 125 ప్రాంతాల్లో ఆటిజం సెంటర్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. తొలి విడతగా 21 సెంటర్లకు కౌన్సిలర్లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెలాఖరుకు 14 సెంటర్ల నిర్మాణాలు పూర్తవుతాయని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో విశాఖపట్నంలో పబ్లిక్ లైబ్రరీ శాఖ భాగస్వామ్యంతో నిర్మించనున్న ప్రతిష్టాత్మక గ్రంథాలయ నమూనాలను మంత్రి లోకేష్ పరిశీలించారు. గ్రంథాలయాన్ని ఆధునిక సదుపాయాలతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.




