AP: మత్స్యకారుల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం మంత్రి!
AP: బంగాళాఖాతంలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఏపీ మత్స్యకారుల భద్రతపై సమీక్షించిన మంత్రి అచ్చెన్నాయుడు. ఒడిశా పోర్టుల్లో సురక్షితంగా పడవలు.
AP: మత్స్యకారుల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం మంత్రి!
AP: బంగాళాఖాతంలో నెలకొన్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మత్స్యకారులు, వారి కుటుంబాలకు ఎలాంటి ఆందోళన లేకుండా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఒడిశా మత్స్యశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో ఉన్న రాష్ట్రానికి చెందిన పడవలకు సురక్షితమైన ఆశ్రయం కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
ఒడిశా అధికారుల నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రానికి చెందిన 51 యాంత్రిక పడవలను గోపాల్‌పూర్ పోర్టులోకి అనుమతించినట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో ఇంజిన్ పనిచేయకుండా సముద్రంలో నిలిచిపోయిన ఒక పడవను సురక్షితంగా లాగి గోపాల్‌పూర్ పోర్టుకు తీసుకువచ్చి లంగరు వేసినట్లు తెలిపారు. మరోవైపు 16 పడవలు అరయపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు క్షేమంగా చేరుకున్నట్లు పేర్కొన్నారు.
పడవలకు గోపాల్‌పూర్ పోర్టులో ఆశ్రయం కల్పించే విషయంలో ఒడిశా మత్స్యశాఖ అధికారులు అక్కడి కలెక్టర్, పోర్టు అధికారులతో సమన్వయం చేసుకున్నారని మంత్రి వివరించారు. సముద్రంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులకు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించే విషయంలో అవసరమైన సహకారం అందిస్తున్న ఒడిశా అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
మత్స్యశాఖ కమిషనర్, సంబంధిత అధికారులు అందించిన సమాచారం మేరకు రెండు పడవలకు చెందిన మత్స్యకారులు, సిబ్బంది గోపాల్‌పూర్‌లో సురక్షితంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు చేరవేసినట్లు వెల్లడించారు. సముద్రంలో ఉన్న మత్స్యకారుల క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారి కుటుంబాలకు తెలియజేస్తూ వారికి భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా ప్రతి పడవ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, పడవల యజమానులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలని మంత్రి సూచించారు. ఏదైనా పడవకు ఇబ్బంది ఏర్పడినట్లు సమాచారం అందితే వెంటనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా అనుకూలించే వరకు మత్స్యకారులు తిరుగు ప్రయాణం చేయకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిస్థితులు సాధారణమైన తర్వాతే ఆయా పడవలు తమకు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు సురక్షితంగా చేరుకునేలా పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు.
మత్స్యకారుల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తీరప్రాంత జిల్లాల మత్స్యశాఖ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మత్స్యకారులందరూ క్షేమంగా తమ ప్రాంతాలకు చేరుకునే వరకు పర్యవేక్షణ, సమన్వయం నిరంతరం కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు.




