పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వ భరోసా... గిట్టుబాటు ధరల నుంచి ఆర్థిక సాయం వరకు కీలకమైన చర్యలు

Amaravati: మార్కెట్‌లో ఏ పరిస్థితులు ఎదురైనా పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైతే నేరుగా కొనుగోళ్లు చేపడతామని స్పష్టం చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 5 Aug 2026 3:53 PM IST
Amaravati
X

పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వ భరోసా... గిట్టుబాటు ధరల నుంచి ఆర్థిక సాయం వరకు కీలకమైన చర్యలు

అమరావతి: పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు మార్కెట్‌లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా ప్రభుత్వం అండగా ఉంటుందని, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు అవసరమైతే నేరుగా కొనుగోళ్లు చేపట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అమరావతిలో బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి పలు కీలక అంశాలను వెల్లడించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారని, మార్కెట్‌లో ధరలు పతనమైనా ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించలేదని మంత్రి విమర్శించారు. టొబాకో బోర్డు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేయడంలో వైఫల్యం కారణంగా రైతులకు సరైన మద్దతు అందలేదని పేర్కొన్నారు. ముఖ్యంగా బర్లీ పొగాకు రైతులు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, మార్క్‌ఫెడ్ ద్వారా పరిమిత కొనుగోళ్లకే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు.

అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక చొరవతో కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరిపి రైతుల ప్రయోజనాల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మార్కెట్‌లో ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ధరల స్థిరీకరణ, ధర లోటు భర్తీ, వడ్డీలేని రుణాలు, ప్రోత్సాహకాలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని వివరించారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేసే ప్రక్రియ చేపట్టామని, బ్రైట్, మీడియం, లో-గ్రేడ్ పొగాకుకు కూడా గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రభుత్వం వ్యాపార సంస్థలతో నేరుగా చర్చలు జరిపిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాసి పొగాకు రైతులకు న్యాయం చేయాలని కోరారని, మార్కెట్‌లో కిలో ధర రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని వెల్లడించారు.

వేలం కేంద్రాల్లో "నో బిడ్", "లో బిడ్" పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, రైతులు తీసుకొచ్చిన పొగాకును కంపెనీలు తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అనధికారిక కొనుగోళ్లు జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైతే ప్రభుత్వమే నేరుగా కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

హెచ్‌డీ బర్లీ పొగాకుకు కనీస మద్దతు ధర నిర్ణయించడం, తక్కువ నాణ్యత గల పొగాకుకు కిలోకు రూ.10 ప్రోత్సాహకం ఇవ్వడం, రూ.100 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం, వడ్డీలేని రుణాలు, మారటోరియం, అధిక సాగు నియంత్రణ, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, ఎగుమతి అవకాశాల విస్తరణ వంటి చర్యల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడమే కాకుండా భవిష్యత్తులో కూడా గిట్టుబాటు ధరలు లభించేలా శాశ్వత విధానాలను రూపొందిస్తున్నామని స్పష్టం చేశారు...

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story