పీఎస్‌యూ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 62 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్ వయస్సు
Amaravati: ఏపీ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు. 2022 జనవరి 1 నుండి వర్తింపు. గ్యాప్ పీరియడ్‌ను నోషనల్ సర్వీస్‌గా గుర్తింపు.
పీఎస్‌యూ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 62 ఏళ్లకు పెరిగిన రిటైర్మెంట్ వయస్సు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర పబ్లిక్ సెక్టార్ యూనిట్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. చాలా కాలంగా ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వారి పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని 2022 జనవరి 1 నుంచి రిట్రోస్పెక్టివ్‌గా అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్ల పదవీ విరమణ వయస్సు అమలులో ఉండగా.. అదే విధానాన్ని ఇప్పుడు పబ్లిక్ సెక్టార్ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 తర్వాత 60 ఏళ్ల వయస్సు పూర్తయిందనే కారణంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. అర్హులైన ఉద్యోగులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం కల్పించనున్నారు.
అయితే తిరిగి ఉద్యోగంలో చేరే వరకు ఉన్న గ్యాప్ పీరియడ్‌కు జీతభత్యాలు చెల్లించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆ కాలాన్ని నోషనల్ సర్వీస్‌గా పరిగణించి వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయనుంది. అలాగే సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో కూడా ఉద్యోగం వెలుపల ఉన్న కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో ఉద్యోగుల సర్వీస్‌కు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటి వరకు విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులకు పూర్తి స్థాయి సర్వీస్ ప్రయోజనాలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే పెన్షన్ పొందుతున్న ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు. అలాగే తిరిగి ఉద్యోగంలో చేరాలనుకోని వారు.. 60 ఏళ్లకే పదవీ విరమణ చేసినట్లుగానే కొనసాగేందుకు కూడా అవకాశం కల్పించారు. దీంతో ఉద్యోగుల వ్యక్తిగత నిర్ణయాలకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినట్లైంది.
ఈ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా చేస్తున్న విజ్ఞప్తిని పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్ వయస్సు పెరగడంతో అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను మరో రెండేళ్ల పాటు వినియోగించుకునే అవకాశం ప్రభుత్వ రంగ సంస్థలకు లభించనుంది. అదే సమయంలో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు కూడా ఈ నిర్ణయం ఆర్థికంగా, ఉద్యోగ భద్రత పరంగా ప్రయోజనం చేకూర్చనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పీఎస్‌యూ ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.




