ఎల్ నినో నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం... శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం...
Amaravati: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం. వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు.
ఎల్ నినో నేపథ్యంలో తాగునీటికే తొలి ప్రాధాన్యం... శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం...
అమరావతి: ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో రాయలసీమతో పాటు రాష్ట్రంలోని తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం జలాశయం నుంచి తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు శ్రీకారం చుట్టింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో నిర్వహించిన సమీక్ష అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 119 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల వరకు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని భద్రపరచేలా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు.
కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న 63 శాతం వాటాలో తొలి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నామని స్పష్టం చేశారు. అందులో భాగంగా శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిని వ్యవసాయ అవసరాల కంటే ముందుగా తాగునీటి అవసరాలకే వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని హంద్రీనీవా పరిధిలోని రిజర్వాయర్లకు మొత్తం 13 టీఎంసీల నీరు అవసరమని మంత్రి వివరించారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ పరిధిలోని రిజర్వాయర్లకు తాగునీటి కోసం రేపటి నుంచి 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో తెలుగు గంగ పథకం ద్వారా చెన్నై నగర తాగునీటి అవసరాల కోసం ఒప్పందం ప్రకారం 10 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాల్సి ఉందన్నారు.
నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలోని తాగునీటి అవసరాల కోసం మరో 32 టీఎంసీల నీరు అవసరమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఎల్ నినో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి వారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని, వర్షపాతం, వరదలు, జలాశయాల్లోకి వచ్చే ఇన్‌ఫ్లోలను బట్టి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని నిమ్మల రామానాయుడు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ విధానంలో నీటి నిర్వహణ చేపట్టి తాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. నీటి వినియోగంపై నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రతి ప్రాంతంలో తాగునీటి భద్రతను నిర్ధారించేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.
ఎల్ నినో సవాళ్లను ముందుగానే అంచనా వేసి తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. దీంతో రాబోయే వేసవి వరకు రాష్ట్రంలో తాగునీటి నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు సంకేతాలు లభించాయి.




