Amaravati: 'ఏపీ గ్రీన్' చైర్‌పర్సన్‌గా నాగబాబు నియామకంపై మంత్రి హర్షం!
Amaravati: ఏపీ గ్రీన్ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం, క్యాబినెట్ హోదాపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
Amaravati: 'ఏపీ గ్రీన్' చైర్‌పర్సన్‌గా నాగబాబు నియామకంపై మంత్రి హర్షం!
Amaravati: రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్’ (ఏపీ గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావు (నాగబాబు)ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయనకు కేబినెట్ హోదా కల్పించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
నాగబాబు నాయకత్వంలో ‘పచ్చని ఆంధ్రప్రదేశ్–ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్’ లక్ష్య సాధనకు మరింత వేగంగా చర్యలు ముందుకు సాగుతాయని మంత్రి దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు అటవీ ప్రాంతాల విస్తరణ, పచ్చదనం పెంపునకు ఏపీ గ్రీన్ కీలక వేదికగా నిలవనుందని పేర్కొన్నారు.
ఏపీ గ్రీన్ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, జిల్లా స్థాయి సంస్థల మధ్య సమన్వయం అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. కార్యక్రమాల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా పర్యవేక్షించే బాధ్యతను నాగబాబు సమర్థవంతంగా నిర్వహిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించే దిశగా దీర్ఘకాలిక కార్యాచరణను అమలు చేయాల్సి ఉంది. మొక్కల పెంపకం, అటవీ సంరక్షణ, పునరావాస వనీకరణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.
నాగబాబుకు అప్పగించిన కొత్త బాధ్యత రాష్ట్ర హరితాభివృద్ధికి మరింత ఊతమిస్తుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఏపీ గ్రీన్ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, రాష్ట్రాన్ని పచ్చదనంలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన చైర్‌పర్సన్ నాగబాబుకు మంత్రి దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు.




