Amaravati: పర్యావరణ దినోత్సవాన ఆసుపత్రుల్లో హరిత విప్లవం
Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక చొరవ. జూన్ 5న ఆసుపత్రుల్లో 12,500 మొక్కలు నాటాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశం.
Amaravati: పర్యావరణ దినోత్సవాన ఆసుపత్రుల్లో హరిత విప్లవం
Amaravati: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు, ఆరోగ్య సంస్థల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్య సేవలు అందించే కేంద్రాలు కేవలం చికిత్సకు మాత్రమే పరిమితం కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రుల ఆవరణలను మరింత పచ్చదనంతో తీర్చిదిద్దడం ద్వారా రోగులు, సిబ్బంది, సందర్శకులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. ఆసుపత్రులు, కళాశాలల్లో అవగాహన సదస్సులు, ఉపన్యాసాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సుస్థిర ఆరోగ్య సేవల ప్రాధాన్యతను వివరించే పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించాలని ఆదేశించారు. విద్యార్థులు, వైద్య సిబ్బంది, రోగులు, వారి సహాయకులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలని సూచించారు. నీటి వృథాను అరికట్టడం, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం వంటి అంశాలపై కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఇక సెకండరీ హెల్త్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో మొక్కల నాటే కార్యక్రమాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ చక్రధర్ బాబు సూచనల మేరకు రాష్ట్రంలోని ఆసుపత్రులు, కార్యాలయాల్లో జూన్ 5న కనీసం 12,500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. ప్రతి ఉద్యోగి కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని పిలుపునిచ్చారు. మొక్కల మనుగడ శాతం పెంచేందుకు అటవీ శాఖతో సమన్వయం చేసుకుని నాణ్యమైన మొక్కలను ఎంపిక చేయాలని, నాటే ముందు గుంతలను సక్రమంగా సిద్ధం చేసి సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు.
మరోవైపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ విష్ణువర్ధన్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, జనరల్ ఆసుపత్రులు, బోధనాసుపత్రులు, ప్రత్యేక వైద్య సంస్థలు, నర్సింగ్ కళాశాలల్లో పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది అందరూ భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపుతో పాటు పర్యావరణంపై సామాజిక బాధ్యతను ప్రజల్లో మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.




