Amaravati: ఏపీలో వర్ష ప్రభావం..అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న విపత్తుల శాఖ!
Amaravati: దక్షిణ ఛత్తీస్‌గఢ్‌పై అల్పపీడనం. ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు.
Amaravati: ఏపీలో వర్ష ప్రభావం..అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్న విపత్తుల శాఖ!
Amaravati: దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాలపై అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈ అల్పపీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ–వాయువ్య దిశగా దక్షిణ ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా కదిలే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోనూ అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
అల్పపీడనం కదలికకు అనుగుణంగా వర్షాల తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప వర్షం, ఈదురుగాలుల సమయంలో బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు తెలిపారు.
మరోవైపు బలమైన గాలుల నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని కోరింది.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అయితే పిడుగులు, బలమైన గాలులు, భారీ వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.




