Amaravati: భారీ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు కఠినతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Amaravati: భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ టేపులు, లైట్లు తప్పనిసరి. 24 ఏటీఎస్ కేంద్రాల్లో 49 పరీక్షలకే ఫిట్‌నెస్ సర్టిఫికెట్ అని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Aug 2026 12:45 PM IST
Amaravati
X

Amaravati: భారీ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు కఠినతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Amaravati: భారీ వాహనాలకు నిబంధనల ప్రకారం రిఫ్లెక్టివ్‌ టేపులు, వెనుక లైట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీలను మరింత పటిష్టం చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

వాహనాల ఫిట్‌నెస్‌ ధృవీకరణలో నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. వాహనాల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

2025లో 2,44,604 వాహనాల తనిఖీ

2025 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 2,44,604 వాహనాలను తనిఖీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2026లో జూలై వరకు మరో 1,04,543 వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. వాహనాల సాంకేతిక సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను పరిశీలించి లోపాలు ఉన్న వాహనాలకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని స్పష్టం చేశారు.

ప్రమాదాలను నివారించేందుకు ముఖ్యంగా భారీ వాహనాల వెనుక భాగంలో రిఫ్లెక్టివ్‌ టేపులు, అవసరమైన లైట్లు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాత్రి వేళల్లో భారీ వాహనాలు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్‌ టేపుల ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

24 ATS కేంద్రాల్లో తనిఖీలు

రాష్ట్రంలోని 24 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో వాహనాల ఫిట్‌నెస్‌ పునరుద్ధరణ సమయంలో విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. ఒక్కో వాహనంపై 30 విజువల్‌, 19 ఫంక్షనల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వాహనం బాహ్య పరిస్థితి నుంచి లైట్లు, బ్రేకులు, ఇతర కీలక భద్రతా అంశాల వరకు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తున్నామని చెప్పారు.

పరీక్షల సమయంలో ఏవైనా లోపాలు గుర్తించినట్లయితే వెంటనే ఫిట్‌నెస్‌ ధృవపత్రం జారీ చేయకుండా తిరస్కరిస్తున్నామని మంత్రి తెలిపారు. లోపాలను సరిచేసిన అనంతరం మళ్లీ పరీక్షలకు హాజరై నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందే అవకాశం ఉంటుందని వివరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణలో వాహనాల ఫిట్‌నెస్‌ కీలకమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారీ వాహనాల్లో రిఫ్లెక్టివ్‌ టేపులు, వెనుక లైట్లు వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ఉండేలా రవాణా శాఖ నిరంతరం తనిఖీలు కొనసాగిస్తుందని తెలిపారు.

ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీల వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story