AP: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీ, వ్యవసాయం, పర్యాటక రంగానికి భారీ ఊతం!
AP: ఏపీలో NH-365BB రహదారి అభివృద్ధికి కేంద్రం రూ. 840.41 కోట్లు మంజూరు చేసింది. ప్రధాని మోదీ, గడ్కరీలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
AP: ఆంధ్రప్రదేశ్‌లో కనెక్టివిటీ, వ్యవసాయం, పర్యాటక రంగానికి భారీ ఊతం!
AP: ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు, రవాణా కనెక్టివిటీని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ, కనెక్టివిటీ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచస్థాయి మౌలిక వసతులు, మెరుగైన రవాణా సదుపాయాలతో వికసిత్ భారత్ నిర్మించాలన్న ఆయన సంకల్పం క్షేత్రస్థాయిలో సాకారం అవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా ఎన్‌హెచ్-365బీబీ పరిధిలోని 45.09 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి కేంద్రం రూ.840.41 కోట్లను మంజూరు చేసింది. బుట్టాయిగూడెం–ఎల్ఎన్‌డీ పేట, పట్టిసీమ–కొవ్వూరు మార్గాలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ నిర్ణయానికి సహకరించిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కూడా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ రహదారి అభివృద్ధితో పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. వ్యవసాయ ఉత్పత్తులను పొలాల నుంచి మార్కెట్లకు వేగంగా తరలించేందుకు వీలు కలుగుతుంది. పంటల రవాణా ఖర్చులు, సమయం తగ్గే అవకాశం ఉండటంతో రైతులకు మెరుగైన మార్కెట్ అనుసంధానం లభించనుంది.
అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రహదారి కనెక్టివిటీ మరింత బలోపేతం కానుంది. పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు ఈ మార్గం కీలకంగా మారనుంది. గ్రామీణ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కూడా రహదారి విస్తరణ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుంటే ఈ రహదారి అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఉంది. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు భక్తులు, పర్యాటకులు సులభంగా చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. పుష్కరాల సమయంలో పెరిగే రద్దీని నిర్వహించడంలోనూ మెరుగైన రహదారి వ్యవస్థ కీలకంగా మారనుంది.
వ్యవసాయం, పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాజెక్టు మరింత ఊతమివ్వనుంది. మెరుగైన రహదారులు, వేగవంతమైన రవాణా, బలమైన ప్రాంతీయ కనెక్టివిటీతో ఆంధ్రప్రదేశ్‌ను మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.




