Amaravati: పీఆర్సీ, డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి: బొప్పరాజు డిమాండ్!

Amaravati: ఉద్యోగుల సమస్యలపై పోరాడితే రాజకీయ రంగు పులమడం తగదని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Aug 2026 7:06 PM IST
Amaravati
X

Amaravati: పీఆర్సీ, డీఏ బకాయిలపై స్పష్టత ఇవ్వాలి: బొప్పరాజు డిమాండ్!

అమరావతి: ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే దానికి రాజకీయ రంగు పులమడం సరికాదని ఏపీ జేఏసీ అమరావతి స్పష్టం చేసింది. ఉద్యోగుల హక్కుల కోసం ప్రశ్నించడం, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం ప్రభుత్వాన్ని అవమానించడం లేదా కించపరచడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున మంత్రి చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు అన్నారు.

విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు, టి.వి. ఫణి పేర్రాజు, పారే లక్ష్మి, పొన్నూరు విజయలక్ష్మి తదితరులు మాట్లాడారు. ఉద్యోగుల సమస్యలే తమకు ప్రధానమని, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం పోరాడటం తమ బాధ్యత అని స్పష్టం చేశారు.

రాజకీయ అజెండా కాదు.. ఉద్యోగుల ప్రయోజనాలే లక్ష్యం

ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రశ్నించడం రాజకీయ అజెండాగా ఎలా మారుతుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. తమ సంఘానికి గతంలోనూ, ఇప్పుడూ ఉద్యోగుల ప్రయోజనాలే ఏకైక అజెండా అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, ప్రభుత్వాన్ని అవమానించాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.

ఎవరు అధికారంలో ఉన్నారన్నది తమకు ప్రాధాన్యం కాదని, అధికారంలో ఉన్న ప్రభుత్వంతోనే ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుపుతామని తెలిపారు. 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండానే అనేక ఉద్యోగుల సమస్యలు పరిష్కరించిన సందర్భాలను గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆ అంశాలను పుస్తక రూపంలో ప్రచురించామని వివరించారు.

గతంలోనూ ఉద్యమాలు.. చర్చలతోనే పరిష్కారాలు

2022-23లో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా నిర్వహించిన ఉద్యమాలను కూడా జేఏసీ నాయకులు గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. అయితే చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఏపీ జేఏసీ అమరావతి ఒంటరిగా 92 రోజుల పాటు ఉద్యమం నిర్వహించిందని చెప్పారు.

ఆ ఉద్యమం సందర్భంగా కూడా అనేక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని తెలిపారు. దశాబ్దాలుగా రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యోగ సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తున్నాయని, గతంలో ఎవరూ వాటికి రాజకీయ రంగు పులమలేదన్నారు. ప్రస్తుతం ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సమయంలో వ్యక్తిగత ఆరోపణలు, రాజకీయ వ్యాఖ్యలు చేయడం తమ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు హామీలనే గుర్తు చేశాం

ఆగస్టు 28న నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వీడియో రూపంలో గుర్తు చేశామని బొప్పరాజు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరడం కుట్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు.

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరడమే తమ ఉద్దేశమని, ప్రభుత్వాన్ని కించపరచడం లేదా అవమానించడం తమ లక్ష్యం కాదన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తే తాము స్వాగతిస్తామని చెప్పారు.

చర్చలు జరిగాయి.. కానీ ఫలితాలు ఎక్కడ?

ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో జూన్ 7న జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమానికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నామని నాయకులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి ఉద్యమ సన్నద్ధత సభలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రెవెన్యూ శాఖ మంత్రి జోక్యం చేసుకుని ఉద్యమం అవసరం లేదని, ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పడంతో తాము వెనక్కి తగ్గామని వివరించారు.

జూలై 10, 11 తేదీల్లో చర్చలు జరిగాయని, అనంతరం అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి జూలై 22న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారని చెప్పారు. ఆ తర్వాత కూడా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్‌లో ఆగస్టు 2, 16 తేదీల్లో సమావేశాలు నిర్వహించిందన్నారు. నాయకులతో చర్చిస్తూ ఆగస్టు 28న రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు ముందుగానే తెలియజేశామని చెప్పారు.

అయినా ఆగస్టు 28 వరకు ప్రభుత్వం నుంచి తమను మరోసారి పిలిచి చర్చించే ప్రయత్నం జరగలేదని, చర్చల్లో తీసుకున్న నిర్ణయాలపై కూడా స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. దీంతో గత్యంతరం లేక రాష్ట్ర సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వచ్చిందని తెలిపారు.

ఐదుగురు మంత్రులు.. ఐఏఎస్ అధికారులతో ఐదు గంటల చర్చలు

ఐదుగురు మంత్రులు, పలువురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీతో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సుమారు ఐదు గంటలపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారని ఏపీ జేఏసీ నాయకులు తెలిపారు. అయితే ఆ చర్చలకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం రాలేదన్నారు.

సుమారు 40 రోజులుగా చర్చల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. చర్చల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? వాటిలో ఎన్ని అమలు చేస్తారు? మిగిలిన సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం చేసిన చెల్లింపులను స్వాగతించాం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు చేసిన కొన్ని చెల్లింపులను తాము స్వాగతించామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా తెలిపామని గుర్తుచేశారు.

ఫిబ్రవరి 5న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరును అభినందిస్తూ తాము మాట్లాడామని తెలిపారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే అభినందించడం ఎంత బాధ్యతో, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమస్యలపై ప్రశ్నించడం కూడా అంతే బాధ్యత అని అన్నారు.

రెండేళ్లు వేచి చూశాం.. ఇక స్పష్టత కావాలి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంతకాలం సహనంగా వేచి చూశామని జేఏసీ నాయకులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని గౌరవించామని చెప్పారు.

అయితే ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలును నిరవధికంగా వాయిదా వేస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను దశలవారీగా అయినా చెల్లించాలని డిమాండ్ చేశారు.

పీఆర్సీ, డీఏ, ఐఆర్‌పై స్పష్టత ఇవ్వాలి

ఉద్యోగుల వేతన సవరణ కోసం పీఆర్సీ కమిషన్‌ను ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదో ప్రభుత్వం వివరించాలని ఉద్యమ పోరాట కమిటీ చైర్మన్ టి.వి. ఫణి పేర్రాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు అమలవుతున్న సమయంలో రాష్ట్ర ఉద్యోగులకు రావాల్సిన డీఏల విషయంలో జాప్యం ఎందుకు జరుగుతోందో ప్రభుత్వం చెప్పాలని కోరారు.

ఐఆర్ ఇస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు దానిపై స్పష్టత లేకపోవడంపై ప్రశ్నించారు. ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలపై ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మొత్తం బకాయిలు ఎంత? ఎప్పటిలోగా చెల్లిస్తారు? ఏ విధంగా చెల్లిస్తారు? అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.

హెల్త్ కార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం

ఉద్యోగుల ఎంప్లాయీస్ హెల్త్ కార్డుల సమస్యను కేవలం కమిటీ ఏర్పాటు చేసి వదిలేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వైద్యానికి లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, వైద్య బిల్లులు సకాలంలో మంజూరు కాక ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ న్యాయం చేయాలి

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అరకొర వేతనాలతో పనిచేస్తున్నారని, వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వైద్యం, విద్య, నిత్యావసరాల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగులపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు.

ఉద్యోగులకు హక్కులు లేవన్నట్టుగా కొన్ని టీవీ చర్చల్లో జరుగుతున్న వ్యాఖ్యలు బాధాకరమని బొప్పరాజు, దామోదరరావు అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే హక్కు ఉద్యోగులకు ఉందని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని స్పష్టం చేశారు.

ప్రభుత్వం శత్రువు కాదు.. చర్చలకు ఎప్పుడూ సిద్ధమే

ఉద్యమం చేస్తున్నామంటే ప్రభుత్వానికి తాము శత్రువులం కాదని మహిళా విభాగం చైర్‌పర్సన్ పారే లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి అన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే తాము ఎప్పుడైనా హాజరవుతామని చెప్పారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికే తమ తొలి ప్రాధాన్యం అన్నారు.

అయితే ఉద్యోగుల సమస్యలపై పోరాడటం కూడా తమ హక్కేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల కోసం ప్రకటించిన ఉద్యమ కార్యాచరణను ఆరోపణలు, ఒత్తిళ్లతో పక్కదారి పట్టించలేరని హెచ్చరించారు.

ఉద్యమ కార్యాచరణ ఆగదు

తమపై ఎన్ని ఆరోపణలు చేసినా ఉద్యమ కార్యాచరణ ఆగదని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్, జేఏసీ రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు తెలిపారు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఫలించవన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆగస్టు 28న రాష్ట్ర సదస్సులో అన్ని జిల్లాల నాయకత్వాల సమక్షంలో రూపొందించిన ఉద్యమ కార్యాచరణను పకడ్బందీగా అమలు చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. వ్యక్తిగత ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెడతామని చెప్పారు.

ప్రభుత్వం తమను ఎప్పుడైనా చర్చలకు పిలిస్తే హాజరై సమస్యల పరిష్కారానికి సహకరిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, పీఆర్సీ, డీఏ, ఐఆర్‌, హెల్త్ కార్డులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రయోజనాలే తమ ఏకైక అజెండా అని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు తేల్చిచెప్పారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story