Amaravati: ఏపీలో వేడెక్కిన జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ వివాదం!
Amaravati: ఏపీలో 15% స్టైఫండ్ పెంపు కోరుతూ సమ్మెకు జూడా సిద్ధం. ఆర్థిక లోటు దృష్ట్యా దశలవారీ పెంపునకు మొగ్గు చూపుతున్న ప్రభుత్వం.
Amaravati: ఏపీలో వేడెక్కిన జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ వివాదం!
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు అంశం మరోసారి వేడెక్కింది. ప్రస్తుతం అందుతున్న స్టైఫండ్‌పై 15 శాతం పెంచాలని APJUDA డిమాండ్ చేస్తుండగా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా పెంపు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఈ అంశంపై జూడా ప్రతినిధులతో ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా.. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆగస్టు 17 నుంచి సమ్మెకు వెళ్లాలన్న జూడా నిర్ణయంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
9,501 మంది.. రూ.586 కోట్ల భారం
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో MBBS, BDS ఇంటర్న్‌లు, PG విద్యార్థులు, సూపర్ స్పెషాలిటీ, MDS, DNB తదితర కోర్సుల్లో ఉన్న మొత్తం 9,501 మంది స్టైఫండ్ పొందుతున్నారు. వీరికి నెలకు సుమారు రూ.48.84 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.586.08 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది.
ప్రస్తుతం ఎంత అందుతోంది?
2024 జనవరి 1 నుంచి అమల్లో ఉన్న రేట్ల ప్రకారం MBBS, BDS ఇంటర్న్‌లకు నెలకు రూ.25,906 స్టైఫండ్ అందుతోంది. PG మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.60,823, రెండో సంవత్సరం రూ.61,528, మూడో సంవత్సరం రూ.64,767 చెల్లిస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో సంవత్సరం ఆధారంగా రూ.80,500 నుంచి రూ.85,100 వరకు అందుతోంది.
2026లో పెంపునకు అవకాశం
సాధారణంగా రెండేళ్లకోసారి స్టైఫండ్ సవరించే విధానం కొనసాగుతోంది. 2018, 2020, 2022, 2024లో పెంపులు జరిగాయి. 2020, 2022, 2024లో 15 శాతం చొప్పున పెంచారు. దీంతో 2026లో మరోసారి సవరణకు అవకాశం ఏర్పడింది. ఈసారి కూడా 15 శాతం పెంపు ఇవ్వాలని జూడా పట్టుబడుతోంది.
పని భారం పెరిగిందంటున్న జూడా
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరగడం, కొత్త స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రావడంతో తమ బాధ్యతలు పెరిగాయని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. ICUలు, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్, మెడికో-లీగల్ కేసులతో పాటు వైద్య విద్య, పరిశోధన, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన పనుల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నామని పేర్కొంటున్నారు. అందుకే ప్రస్తుత స్టైఫండ్‌కు 15 శాతం పెంపు న్యాయమైన డిమాండ్ అని వాదిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే..
MBBS ఇంటర్న్‌ల స్టైఫండ్ విషయంలో ఏపీ కంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ చెల్లింపులు జరుగుతున్నాయి. కర్ణాటకలో రూ.30 వేలు, తెలంగాణలో రూ.29,792, తమిళనాడులో రూ.27,319, కేరళలో రూ.27,300 వరకు ఉంది. అయితే అన్ని కోర్సుల్లోనూ ఏపీ వెనుకబడి ఉందని చెప్పలేమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఏపీ స్టైఫండ్ కొన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉందని వివరిస్తున్నాయి.
15 శాతం పెంచితే ఎంత?
ప్రస్తుత రేట్లపై 15 శాతం పెంపు అమలు చేస్తే MBBS ఇంటర్న్‌ల స్టైఫండ్ రూ.25,906 నుంచి రూ.29,792కు చేరుతుంది. PG మొదటి సంవత్సరం స్టైఫండ్ రూ.60,823 నుంచి రూ.69,946కు, సూపర్ స్పెషాలిటీ మొదటి సంవత్సరం స్టైఫండ్ రూ.80,500 నుంచి రూ.92,575కు పెరుగుతుంది. మొత్తంగా ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.87.91 కోట్ల అదనపు భారం పడుతుంది.
దశలవారీ పెంపు ప్రతిపాదన
ఒక్కసారిగా 15 శాతం పెంపు చేయడం కంటే.. ప్రతి ఏడాది నిర్దిష్ట శాతంలో స్టైఫండ్ పెంచే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 3 శాతం పెంపు చేస్తే ఏడాదికి రూ.17.58 కోట్లు, 5 శాతం అయితే రూ.29.30 కోట్లు, 10 శాతం అయితే రూ.58.61 కోట్లు, 15 శాతం అయితే రూ.87.91 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో దశలవారీ పెంపు ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం భావిస్తోంది.
జూలై 17 నుంచి చర్చలు
స్టైఫండ్ అంశంపై జూలై 17 నుంచి జూడా ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది. తాజాగా ఆగస్టు 15న కూడా చర్చలు జరిగాయి. 15 శాతం డిమాండ్‌పై పునరాలోచన చేయాలని అధికారులు కోరగా.. జూడా మాత్రం తమ డిమాండ్‌ను కొనసాగించింది. సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేసి చర్చలకు రావాలని, అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా విధుల్లో కొనసాగాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.
సమ్మె వేళ.. ఆసుపత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
జూనియర్ డాక్టర్ల నిరసనల ప్రభావం రోగులపై పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరమైన చోట అదనపు వైద్యులను అందుబాటులో ఉంచుతోంది. ICUలు, ఎమర్జెన్సీ, ప్రసూతి, ఆపరేషన్ థియేటర్లు, NICU, PICU, డయాలసిస్, ట్రామా సేవలు నిరంతరం కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది.
నిరసనల మధ్యా కొనసాగిన వైద్యం
జూడా నిరసనలు కొనసాగుతున్న సమయంలోనూ ప్రభుత్వ బోధనా ఆసుపత్రుల్లో భారీగా వైద్య సేవలు కొనసాగాయి. ఆగస్టు 11న 32,575 OP కేసులు, 2,398 IP కేసులు, 2,647 సర్జరీలు నమోదయ్యాయి. ఆగస్టు 12న 33,035 OP కేసులు, 2,085 IP కేసులు, 2,589 సర్జరీలు జరిగాయి. ఆగస్టు 13న 34,442 OP కేసులు, 1,159 IP కేసులు, 2,122 సర్జరీలు, 147 డెలివరీలు నమోదయ్యాయి.
స్టైఫండ్ డిమాండ్ ఒకవైపు.. రోగుల ప్రాణాలు మరోవైపు
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు డిమాండ్‌ను ప్రభుత్వం పూర్తిగా విస్మరించడం లేదని స్పష్టం చేస్తోంది. అదే సమయంలో వైద్య సేవలు నిలిచిపోవడం వల్ల రోగులు ఇబ్బందులు పడకూడదన్నదే తమ ప్రాధాన్యత అని చెబుతోంది. అత్యవసర రోగులు, గర్భిణులు, చిన్నారులు, ICU, డయాలసిస్, ప్రమాద బాధితులకు సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తోంది.
స్టైఫండ్ పెంపుపై జూడా 15 శాతం డిమాండ్‌తో ముందుకు వెళ్తుంటే.. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఏటా క్రమబద్ధమైన పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమ్మెతో సమస్య మరింత ముదరకుండా చర్చల ద్వారానే పరిష్కారం కనుగొనాలన్నదే ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. అయితే ఈ చర్చలకు ముగింపు ఎప్పుడు.. జూడా సమ్మె నిర్ణయం మారుతుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.




