AP: రైతుకు మేలు జరిగితే అభినందించాలి.. అపోహలు సృష్టించొద్దు..వ్యవసాయ శాఖ మంత్రి!

AP: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలతో ఖరీఫ్–2026లో పంటల బీమా నమోదు రికార్డు స్థాయిలో 35.17 లక్షలకు చేరిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 16 Aug 2026 8:47 PM IST
AP
X

AP: రైతుకు మేలు జరిగితే అభినందించాలి.. అపోహలు సృష్టించొద్దు..వ్యవసాయ శాఖ మంత్రి!

AP: రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పెద్దఎత్తున పంటల బీమా నమోదు చేపడితే దానిని వక్రీకరించి ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అవాస్తవాలతో రైతుల్లో అపోహలు సృష్టించే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అనిశ్చిత వర్షపాతం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం పంటల బీమాపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు.

అర్హులైన ప్రతి రైతుకూ బీమా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులను ప్రత్యక్షంగా సంప్రదించడంతో పాటు రైతు సేవా కేంద్రం, క్లస్టర్, రైతువారీగా అర్హుల వివరాలను మ్యాపింగ్ చేశామని మంత్రి తెలిపారు. బీమా పరిధిలోకి రాని అర్హులైన రైతులను గుర్తించి జూలై 29 నుంచి 31 వరకు ప్రత్యేక పంటల బీమా నమోదు కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఇది సిబ్బందిపై ఒత్తిడి కాదని, అర్హులైన ప్రతి రైతుకూ బీమా రక్షణ కల్పించాలనే బాధ్యతాయుత చర్య అని స్పష్టం చేశారు.

రైతు సమ్మతితోనే నమోదు

పంటల బీమా నమోదు పూర్తిగా రైతుల సమ్మతి, వారి ఇష్టప్రకారమే జరిగిందని మంత్రి తేల్చిచెప్పారు. ఎవరినీ బలవంతంగా నమోదు చేయలేదన్నారు. బీమా గడువు ముగిసిన తర్వాత నమోదు చేసుకునే అవకాశం ఉండదని, అందుకే పంట సాగుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులకు ముందుగానే అవగాహన కల్పించి బీమా తీసుకునే అవకాశం కల్పించామని తెలిపారు.

రైతుపై స్వల్ప ప్రీమియం భారం

బీమా మొత్తంలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం కేవలం 0 నుంచి 2 శాతం మాత్రమేనని, మిగిలిన ప్రీమియాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని అచ్చెన్నాయుడు వివరించారు. కొన్ని జిల్లాల్లో ఎకరాకు రైతు చెల్లించాల్సిన ప్రీమియం చాలా తక్కువగా ఉందన్నారు.

వరి – కోనసీమ జిల్లాలో ₹76

సజ్జ – కర్నూలు జిల్లాలో ₹32

మినుము – కడప జిల్లాలో ₹38

వేరుశనగ – నెల్లూరు జిల్లాలో ₹280

జొన్న – కడప/కర్నూలు జిల్లాల్లో ₹35

మొక్కజొన్న – కర్నూలు/శ్రీకాకుళం జిల్లాల్లో ₹66

కంది – కడప జిల్లాలో ₹36

ఉల్లి – కడప/కర్నూలు జిల్లాల్లో ₹90

మిరప – కర్నూలు/పల్నాడు జిల్లాల్లో ₹360

క్లస్టర్, జిల్లా, పంట, బీమా కంపెనీని బట్టి ప్రీమియంలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చని తెలిపారు.

బీమా గడువుల పొడిగింపునకు ప్రత్యేక చొరవ

ఎల్‌నినో ప్రమాదం నేపథ్యంలో బీమా గడువుల పొడిగింపునకు బీమా కంపెనీలు తొలుత సుముఖత చూపకపోయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం, బీమా సంస్థలతో మాట్లాడి రైతుల ప్రయోజనాల కోసం గడువులను పొడిగించేలా కృషి చేశారని మంత్రి తెలిపారు.

వాతావరణ ఆధారిత RWBCIS గడువును జూలై 15 నుంచి జూలై 31 వరకు, దిగుబడి ఆధారిత PMFBY గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించామని చెప్పారు. PMFBY నమోదును ఆగస్టు 31 వరకు మరింత పొడిగించాలని కేంద్రానికి ప్రతిపాదించామని, నమోదు వివరాలను పూర్తిచేసేందుకు బ్యాంకులకు అదనంగా 15 రోజుల సమయం ఇచ్చినట్లు వెల్లడించారు.

రికార్డు స్థాయికి బీమా నమోదు

కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా ఖరీఫ్–2026లో పంటల బీమా నమోదు గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు.

ఖరీఫ్–2025లో దరఖాస్తులు: 19.50 లక్షలు

ఖరీఫ్–2026లో దరఖాస్తులు: 35.17 లక్షలు

నమోదు పెరుగుదల: సుమారు 80 శాతం

రుణాలు తీసుకోని రైతుల నమోదు: 2.00 లక్షల నుంచి 20.35 లక్షలకు

బీమా విస్తీర్ణం: 7.83 లక్షల హెక్టార్ల నుంచి 15.17 లక్షల హెక్టార్లకు

బీమా విస్తీర్ణం పెరుగుదల: సుమారు 94 శాతం

మొత్తం బీమా మొత్తం: ₹13,983 కోట్లు

బీమా విస్తీర్ణంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం: 5వది

గత ప్రభుత్వ బకాయిలపై సమాధానం చెప్పాలి

రైతులకు పరిహారం అందడం లేదంటూ విమర్శలు చేస్తున్న వారు గత ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన సుమారు ₹1,990 కోట్ల ప్రీమియం బకాయిలపై ముందుగా సమాధానం చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ బకాయిల కారణంగానే రైతులకు రావాల్సిన బీమా పరిహారం నిలిచిపోయిందన్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం గత బకాయిలను కూడా దశలవారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఖరీఫ్–2025కు సంబంధించిన ప్రభుత్వ ప్రీమియం చెల్లించడంతో రైతుల ఖాతాల్లో బీమా పరిహారం జమయ్యే ప్రక్రియ ప్రారంభమైందని వెల్లడించారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఎల్‌నినో నేపథ్యంలో ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని, అత్యంత తక్కువ ప్రీమియంతో గరిష్ఠ బీమా రక్షణ కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు మేలు జరుగుతుంటే అభినందించాల్సింది పోయి వాస్తవాలను వక్రీకరించి అపోహలు సృష్టించడం రైతు ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. గణాంకాలు, వాస్తవాలే కూటమి ప్రభుత్వ రైతు సంక్షేమ నిబద్ధతకు నిదర్శనమని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story