Vijayawada: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు త్వరలోనే పరిష్కారం!
Vijayawada: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్ పెండింగ్ అంశాలపై మంత్రి నారాయణను కలిసిన సొసైటీ ప్రతినిధులు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ.
Vijayawada: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు త్వరలోనే పరిష్కారం!
Vijayawada: అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీమ్‌కు త్వరితగతిన పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా ఉన్నారని పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై సీఆర్‌డీఏ కమిషనర్‌తో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో వెంటనే మాట్లాడి తదుపరి కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
బుధవారం విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు మంత్రి నారాయణను కలిశారు. సొసైటీ సభ్యుల గృహ నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్ నుంచి పొందిన న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని మంత్రికి అందజేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 107, దాని అమలుకు సంబంధించిన విధివిధానాలు, హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి ఉన్న న్యాయపరమైన అంశాలను వివరించారు.
హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించి గతంలో జారీ చేసిన జీఓలన్నీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోనే ఉన్నాయని, ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన బాధ్యత కూడా సంబంధిత శాఖపైనే ఉందని సొసైటీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ అంశంపై ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, వివిధ దశల్లో అధికారులతో జరిగిన చర్చల వివరాలను కూడా ఆయనకు అందించారు.
సొసైటీ ప్రతినిధుల నుంచి వివరాలను పూర్తిగా విన్న మంత్రి నారాయణ.. సంబంధిత అధికారులతో వెంటనే చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఆర్‌డీఏ కమిషనర్‌తో మాట్లాడటంతో పాటు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శితో కూడా చర్చిస్తానని తెలిపారు. పాత్రికేయుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తమది జర్నలిస్టు స్నేహపూర్వక ప్రభుత్వమని పేర్కొన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కీలకమని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న సమయంలో జర్నలిస్టుల పాత్ర కూడా ముఖ్యమని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను సానుకూలంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఈ అంశంపై గతంలోనే మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ విశ్వనాథన్ సొసైటీ ప్రతినిధులతో చర్చించారు. సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లే అవకాశాలను వారు వివరించారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ తాజాగా ఇచ్చిన హామీతో హౌసింగ్ స్కీమ్‌పై సీఆర్‌డీఏ స్థాయిలో తదుపరి ప్రక్రియ కదలికలోకి వస్తుందనే ఆశాభావాన్ని సొసైటీ ప్రతినిధులు వ్యక్తం చేశారు.
మంత్రి నారాయణను కలిసిన వారిలో అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి పాటిబండ్ల నాగ శ్రీనివాస్, వ్యవస్థాపక కార్యదర్శి చావా రవి, ది పయనీర్ చీఫ్ ఆఫ్ బ్యూరో డాక్టర్ రవి కుమార్ బొప్పన, ది హిందూ డిప్యూటీ ఎడిటర్ తిరువాయిపాటి శ్రీనాథ్, హన్స్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ శ్యామ్ సుందర్, ఆంధ్ర ప్రభ చీఫ్ ఆఫ్ బ్యూరో నేరెళ్లకుంట గోపి, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు కృష్ణారావు, రామకృష్ణ పాల్గొన్నారు.




