కూటమిలో చిచ్చు పెట్టే ఫేక్ అకౌంట్లపై ఉమ్మడి పోరాటం..టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక సూచనలు..
Amaravati: టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య చిచ్చుపెట్టే ఫేక్ అకౌంట్లపై ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సీరియస్. ఉమ్మడి కార్యాచరణతో అడ్డుకట్ట.
కూటమిలో చిచ్చు పెట్టే ఫేక్ అకౌంట్లపై ఉమ్మడి పోరాటం..టీడీపీ, జనసేన, బీజేపీ సోషల్ మీడియా కార్యకర్తలకు కీలక సూచనలు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి ఐక్యతను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కూటమి భాగస్వామ్య పక్షాలు అప్రమత్తమయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానుల ముసుగులో కొందరు ఫేక్ అకౌంట్లు, సూడో అభిమానుల పేరుతో మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ పేర్కొంది. ఇలాంటి ఖాతాలను గుర్తించి, వాటి ద్వారా జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు మూడు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయించాయి.
ఒక పార్టీ అభిమానుల్లా కనిపిస్తూ మరో మిత్రపక్షానికి చెందిన ముఖ్య నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ఈ తరహా ఫేక్ అకౌంట్ల ప్రధాన వ్యూహంగా మారిందని కూటమి నేతలు చెబుతున్నారు. టీడీపీ అభిమానిగా కనిపించే ఖాతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రశంసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేయడం.. జనసేన అభిమానిగా కనిపించే మరో ఖాతా చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శించడం వంటి పోస్టులతో అసలైన కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఇలాంటి పోస్టులు, కామెంట్ల కారణంగా అసలైన కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై పరస్పరం విమర్శలకు దిగుతున్నారని కూటమి సోషల్ మీడియా విభాగం అభిప్రాయపడింది. చివరకు ఈ వివాదాలు కూటమి మధ్య విభేదాలకు దారితీసి, రాజకీయంగా వైసీపీకి ప్రయోజనం చేకూర్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన సమయంలో మిత్రపక్షాల మధ్యే విభేదాలు సృష్టించడం మిత్ర ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలు లేదా కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
అయితే ప్రతి వివాదాస్పద పోస్టును వెంటనే నమ్మి స్పందించవద్దని అసలైన కార్యకర్తలకు కూటమి నాయకత్వం సూచించింది. అనుమానాస్పద ఖాతాలు, పోస్టులు, కామెంట్లు కనిపిస్తే వాటిపై ప్రత్యక్ష దాడులకు దిగకుండా సంబంధిత పార్టీ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. ఫేక్ అకౌంట్లను గుర్తించి, వాటి వెనుక ఉన్న వ్యక్తులపై తగిన చర్యలు తీసుకునే బాధ్యతను పార్టీలు చేపడతాయని తెలిపింది.
మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని మూడు పార్టీలు తమ సోషల్ మీడియా కార్యకర్తలకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వాస్తవాలను స్పష్టంగా వివరించాలని సూచించాయి.
కూటమిలో అంతర్గత విభేదాలకు సోషల్ మీడియా వేదిక కాకూడదని.. కూటమి ఐక్యతను బలోపేతం చేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా ఉండాలని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేసింది.




