AP: పింఛనుదారులకు గుడ్ న్యూస్‌.. అక్టోబర్ 1 ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ!

AP: ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్ 1 ఉదయం 6:30 నుంచే ఇంటి వద్ద నగదు అందజేత రూ.2,692.34 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 28 Sept 2026 9:26 PM IST
AP
X

AP: పింఛనుదారులకు గుడ్ న్యూస్‌.. అక్టోబర్ 1 ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ!

AP: రాష్ట్రంలోని ఎన్టీఆర్‌ భరోసా పింఛనుదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అక్టోబర్‌ 1వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచే పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. గతంలో పింఛన్ల పంపిణీ వేళల్లో మార్పులపై వచ్చిన సమాచారంతో సంబంధం లేకుండా.. ఎప్పటిలాగే తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు అందజేయనున్నట్లు తెలిపారు.

బ్యాంకు ఉద్యోగులు సమ్మెను విరమించడంతో రాష్ట్రంలో బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం లేదని మంత్రి పేర్కొన్నారు. దీంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం పింఛన్ల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సెప్టెంబర్‌ 30వ తేదీనే స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సిబ్బంది తమ పరిధిలోని బ్యాంకుల నుంచి పింఛన్లకు అవసరమైన 100 శాతం నగదును విత్‌డ్రా చేసుకుంటారని తెలిపారు. అక్టోబర్‌ 1 ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను మొత్తాన్ని అందజేస్తారని స్పష్టం చేశారు.

అక్టోబర్‌ నెలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రూ.2,692.34 కోట్లను విడుదల చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఇందులో రూ.2,692.28 కోట్లను పంచాయతీలు, వార్డుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. గజపతినగరం మండలంలోని నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రామ్‌ (NSAP) పింఛనుదారులకు సంబంధించిన రూ.6 లక్షలను డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) ద్వారా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు.

పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 30వ తేదీ నాటికి అవసరమైన నగదు అందుబాటులో ఉండేలా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు (PDలు), ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC), సంబంధిత బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ నగదు లభ్యత, పంపిణీ ఏర్పాట్లను ముందుగానే పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో మొత్తం 61.80 లక్షల మంది పింఛనుదారులకు ప్రతి నెలా ఒకటో తేదీనే సకాలంలో పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హత కలిగిన పింఛనుదారులకు ఇబ్బందులు కలగకుండా ఇంటి వద్దే నగదు అందించే విధానాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.

పింఛన్ల పంపిణీ కోసం అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. బ్యాంకుల నుంచి నగదు ఉపసంహరణ మొదలుకొని లబ్ధిదారుల ఇళ్ల వద్ద పంపిణీ వరకు ప్రతి దశలోనూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్‌ 1 ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.