Amaravati: రాష్ట్రంలో శరవేగంగా పోర్టులు, హార్బర్ల నిర్మాణాలు!

Amaravati: రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిని అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.

Hari Kishan  AP Bureau Chief
Published on: 18 Aug 2026 12:40 PM IST
Amaravati
X

Amaravati: రాష్ట్రంలో శరవేగంగా పోర్టులు, హార్బర్ల నిర్మాణాలు!

Amaravati: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై శాసనసభలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గౌతు శిరీష, కాగిత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నాలుగు ప్రతిపాదిత పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే ఆయా పోర్టుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు అభివృద్ధి పనులు 81.45 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మచిలీపట్నం పోర్టు పనులు 59.24 శాతం, మూలాపేట పోర్టు పనులు 76.17 శాతం, కాకినాడ గేట్‌వే పోర్టు పనులు 33.04 శాతం మేర పూర్తయ్యాయని సభకు వివరించారు.

రాష్ట్ర తీరప్రాంత అభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషించనున్నాయని, సముద్ర రవాణా, వాణిజ్యం, పరిశ్రమల విస్తరణతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగేలా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. పోర్టుల నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు.

అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఏడు ఫిషింగ్ హార్బర్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం రెండో దశ, మచిలీపట్నం రెండో దశ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.

ప్రతిపాదిత ఏడు ఫిషింగ్ హార్బర్లలో ప్రస్తుతం నాలుగు చోట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 97.98 శాతం పూర్తయ్యే దశకు చేరుకున్నాయని చెప్పారు. నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ రెండో దశ పనులు 81.61 శాతం మేర పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ రెండో దశ పనులు 71.96 శాతం పూర్తయ్యాయని, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు 86.24 శాతం మేర పురోగతిలో ఉన్నాయని మంత్రి సభకు వివరించారు. మిగిలిన ప్రతిపాదిత హార్బర్లకు సంబంధించి కూడా అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంతో తీర ప్రాంత మత్స్యకారులకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి పేర్కొన్నారు. చేపల వేట, నిల్వ, రవాణా, మార్కెటింగ్‌కు అవసరమైన వసతులు అభివృద్ధి చెందడంతో మత్స్యకారుల జీవనోపాధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీరప్రాంతాన్ని సమర్థంగా వినియోగించుకుని సముద్ర ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులను నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు,భావనల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి సభకు తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story