AP: ఏపీలో భారీ వర్షాలు ఆర్&బీ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి!
AP: తీవ్ర వాయుగుండం వర్షాల కారణంగా రాష్ట్రంలో 690 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఆర్&బీ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
AP: ఏపీలో భారీ వర్షాలు ఆర్&బీ శాఖను అప్రమత్తం చేసిన మంత్రి!
AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్ & బీ శాఖను పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజల రాకపోకలకు, ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం కలగకుండా రహదారులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్ & బీ రహదారుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలకు వెళ్లే రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రహదారి కోతలు, గండ్లు ఏర్పడే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడైనా రాకపోకలు నిలిచిపోతే ముందుగా ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, ఆ తర్వాత శాశ్వత మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సీడీ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. కల్వర్టులు, కాజ్‌వేల వద్ద ఫ్లడ్ లెవల్ సూచికలను తనిఖీ చేయాలని, అవసరమైన చోట్ల కొత్త సూచికలను ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారుల వెంట ప్రమాదకరంగా ఉన్న చెట్లు, కొమ్మలను ముందుగానే తొలగించాలని ఆదేశించారు. రహదారి కోతలు జరిగే ప్రాంతాల్లో ఇసుక సంచులు, ఆర్‌సీసీ పైపులు, సరుగుడు కర్రలు వంటి అత్యవసర సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వర్షాలు, ఈదురుగాలులతో రోడ్లపై చెట్లు, విద్యుత్ తీగలు, బోర్డులు తదితరాలు పడే అవకాశం ఉన్నందున హ్యాక్సాలు, పవర్ సాలు, క్రేన్లు, జేసీబీలు, ప్రొక్లైనర్లు వంటి పరికరాలు, భారీ యంత్రాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 690 కిలోమీటర్ల మేర ఆర్ & బీ రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. ఇందులో శ్రీకాకుళం జిల్లాలోనే 250 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఎనిమిది చోట్ల తీవ్ర గుంతలు ఏర్పడి రహదారులు కొట్టుకుపోగా, మరో చోట రహదారి కోతకు గురైంది. మూడు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
భారీ వర్షాలు, వరదల కారణంగా 85 చోట్ల సీడీ వర్క్స్ దెబ్బతినగా, 62 చోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. అలాగే 59 ప్రాంతాల్లో రహదారులపై చెట్లు నేలకొరగగా, 58 చెట్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు.
దెబ్బతిన్న రహదారుల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.34.38 కోట్లు, శాశ్వత పనులకు రూ.291.87 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా రహదారుల పునరుద్ధరణకు రూ.402.18 కోట్ల ప్రాథమిక అంచనా రూపొందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 614 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. అత్యవసర సహాయక చర్యల కోసం 550 జేసీబీలు, 596 పవర్ సాలు సిద్ధంగా ఉంచారు. అలాగే 78 కంట్రోల్ రూమ్‌లు, నోడల్ అధికారులను ఏర్పాటు చేసి 24 గంటల పాటు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు...




