AP: విజయవాడ ఈఎన్సీ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష!

AP: విజయవాడ ఆర్ అండ్ బీ కార్యాలయంలో రహదారుల అభివృద్ధిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమగ్ర సమీక్ష. పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతానికి ఆదేశాలు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 5 Aug 2026 11:01 PM IST
AP
X

AP: విజయవాడ ఈఎన్సీ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమగ్ర సమీక్ష!

AP: రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న అన్ని రహదారి ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ శాఖ ఈఎన్సీ కార్యాలయంలో ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖ పురోగతిపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు.

రాష్ట్రంలో మొత్తం 45,433 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ రహదారులు ఉండగా, అందులో 10,238 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు. వార్షిక నిర్వహణ కార్యక్రమంలో భాగంగా 22,602 కిలోమీటర్ల మేర గుంతల రహిత రహదారుల లక్ష్యాన్ని సాధించేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు. రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కిలోమీటర్ల రహదారి పనుల్లో ఇప్పటివరకు 53 శాతం మాత్రమే పూర్తవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి, వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే రూ.514 కోట్ల విలువైన పనుల్లో జాప్యం చోటుచేసుకున్న ప్రాంతాల్లో పురోగతిని మెరుగుపరచాలని సూచించారు.

బిటుమన్ కొరత, ధరల పెరుగుదల కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని అధికారులు వివరించగా, కాంట్రాక్టర్లకు ధరల సవరణకు ప్రభుత్వం ఇప్పటికే వెసులుబాటు కల్పించిందని మంత్రి గుర్తుచేశారు. రూ.40 లక్షల విలువైన పనులకు కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించినట్లు తెలిపారు. పనులు వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు త్వరితగతిన చెల్లిస్తామని స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ప్రభుత్వం రూ.8,530 కోట్ల నిధులు మంజూరు చేయగా, ఇప్పటికే రూ.4,110 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు.

పీపీపీ విధానంలో చేపట్టనున్న 11 ప్రాజెక్టుల్లో తొలి దశలో ఆరు ప్రాజెక్టులకు భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రూ.327 కోట్లతో 443 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి, పుష్కర ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలను కూడా సమీక్షించారు.

జాతీయ రహదారుల అభివృద్ధిపైనా మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 8,360 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా, ప్రతి లక్ష జనాభాకు 17.64 కిలోమీటర్ల రహదారి సాంద్రతతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో ఉందన్నారు. 2026-27లో రూ.12,500 కోట్లతో 653 కిలోమీటర్ల జాతీయ రహదారి పనులు చేపట్టగా, ఇప్పటికే 154 కిలోమీటర్లు పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో రూ.72,688 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వాటి అమలుకు అవసరమైన భూసేకరణను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఆర్‌ఐఎఫ్ కింద చేపట్టిన 252 పనుల్లో 208 పూర్తయ్యాయని, మిగిలిన వాటిని వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ఎన్‌డీబీ కింద కొనసాగుతున్న రహదారి పనులు, వరదలకు గురవుతున్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రహదారుల బలోపేతం, శిథిలావస్థలో ఉన్న వంతెనల పునర్నిర్మాణ ప్రతిపాదనలపై కూడా సమీక్ష నిర్వహించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ శాఖ అధికారిక యూట్యూబ్ ఛానల్ **"WATCH AP RISE"**ను మంత్రి ప్రారంభించారు. శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారుల సేవలు ప్రజలకు చేరువయ్యేలా ఈ వేదిక ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే మీడియా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతికూల కథనాలపై క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని, జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా శాఖపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story