AP: శ్రీ శక్తికి ఏడాది...ఉచిత బస్సు ప్రయాణంతో ఏడాదిలో 87 కోట్ల ప్రయాణాలు!

AP: ఏపీలో 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏడాది పూర్తి చేసుకుంది. ఏడాదిలో 87 కోట్ల ప్రయాణాలు నమోదు కాగా, మహిళలతో కలిసి సీఎం చంద్రబాబు బస్సులో ప్రయాణించనున్నారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 14 Aug 2026 8:03 PM IST
AP
X

AP: శ్రీ శక్తికి ఏడాది...ఉచిత బస్సు ప్రయాణంతో ఏడాదిలో 87 కోట్ల ప్రయాణాలు!

AP: ఆర్థిక స్వాతంత్య్రం అంటే కేవలం ఆదాయం పెరగడం మాత్రమే కాదు.. అవసరమైన చోటుకు స్వేచ్ఛగా వెళ్లగలగడం కూడా. ప్రయాణ ఖర్చు కారణంగా వెనకడుగు వేసే పరిస్థితికి తెరదించుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘స్త్రీ శక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకం మహిళల దైనందిన జీవితంలో కీలక మార్పుకు కారణమవుతోంది. ఏడాది క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం.. ఇప్పుడు కోట్లాది మహిళల ప్రయాణానికి అండగా నిలుస్తోంది.

ఒకప్పుడు బస్సు ఛార్జీ కోసం ఆలోచించి ప్రయాణాన్ని వాయిదా వేసే మహిళలు.. ఇప్పుడు అవసరమైతే ఎన్నిసార్లయినా బస్సెక్కే అవకాశం పొందుతున్నారు. విద్య, ఉపాధి, వైద్యం, చిరు వ్యాపారం, ఆధ్యాత్మిక ప్రయాణాలు.. ఇలా అవసరం ఏదైనా ‘స్త్రీ శక్తి’ మహిళలకు అందుబాటులో ఉన్న ప్రయాణ సాధనంగా మారింది.

ఏడాదిలో 87 కోట్ల ప్రయాణాలు

2025 ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 87 కోట్ల ప్రయాణాలు చేశారు. రోజుకు సగటున 24 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అంటే ప్రతి రోజూ లక్షలాది కుటుంబాలకు ప్రయాణ ఖర్చు భారం తగ్గుతోంది.

పథకం అమలుకు ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. మహిళల ప్రయాణానికి రోజుకు సగటున రూ.8.53 కోట్ల సబ్సిడీ అందిస్తోంది. ఏడాది వ్యవధిలో ఇప్పటివరకు సుమారు రూ.3,095 కోట్లు ఖర్చు చేసింది. ఈ వ్యయం మహిళల ప్రయాణ స్వేచ్ఛను పెంచడంతో పాటు.. వారి ఆర్థిక సాధికారతకు పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తోంది.

40 శాతం నుంచి 62 శాతానికి..

స్త్రీ శక్తి పథకం రాకముందు ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల వాటా సుమారు 40 శాతంగా ఉండేది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చిన తర్వాత అది 62 శాతానికి పెరిగింది. మహిళా ప్రయాణికుల సంఖ్యలోనూ భారీ మార్పు వచ్చింది. పథకం ప్రారంభానికి ముందు రోజుకు సుమారు 9.47 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 24 లక్షలకు చేరింది.

పథకం అమలవుతున్న బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా 93 శాతానికి చేరుకోవడం.. మహిళలు ఆర్టీసీ సేవలను ఎంతగా వినియోగించుకుంటున్నారో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోంది.

ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మహిళలకు ప్రయాణ సౌకర్యం అందేలా ప్రభుత్వం ఐదు కేటగిరీల బస్సుల్లో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఎక్స్‌ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,978 ఆర్టీసీ బస్సుల్లో 7,631 బస్సులు, అంటే దాదాపు 76 శాతం బస్సులు ఈ పథకం పరిధిలో ఉన్నాయి. అంతేకాదు.. ఆలయాలకు నడిపే ప్రత్యేక బస్సు సర్వీసుల్లోనూ మహిళలకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఆధార్ కార్డును చూపించి రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉండటం.. పథకాన్ని మరింత సులభతరం చేసింది.

ఇంటి నుంచి మార్కెట్‌ వరకు.. గ్రామం నుంచి నగరం వరకు

స్త్రీ శక్తి పథకం ప్రభావం కేవలం ఆర్టీసీ గణాంకాల్లోనే కనిపించడం లేదు. మహిళల రోజువారీ జీవితంలోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

చిన్న పట్టణాలు, గ్రామాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు మార్కెట్లకు వెళ్లేందుకు బస్సులను వినియోగిస్తున్నారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి వస్తువులు కొనుగోలు చేయడం, విక్రయించడం వంటి కార్యకలాపాలకు ఉచిత ప్రయాణం ఉపయోగపడుతోంది.

కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలు, వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లేవారు, కుటుంబ అవసరాల కోసం ప్రయాణించేవారు.. ఇలా అన్ని వర్గాల మహిళలకు ఈ పథకం ప్రయోజనం అందిస్తోంది.

ప్రయాణ ఖర్చు తగ్గడంతో చేతిలో మిగిలే డబ్బును కుటుంబ అవసరాలకు, పిల్లల చదువులకు లేదా చిన్న వ్యాపారానికి వినియోగించే అవకాశం ఏర్పడుతోంది. ఈ విధంగా ప్రయాణ రాయితీ క్రమంగా ఆర్థిక స్వావలంబనకు దోహదపడే సాధనంగా మారుతోంది.

వ్యక్తిగత వాహనాలపై ఆధారపడటం తగ్గింపు

స్త్రీ శక్తి పథకం మరో ప్రభావం రోడ్డు భద్రతపైనా కనిపిస్తోందని అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో షేర్ ఆటోలు, ద్విచక్ర వాహనాలు, ఇతర వ్యక్తిగత రవాణా మార్గాలపై ఆధారపడే మహిళలు ఆర్టీసీ బస్సులను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.

దీంతో కొన్ని ప్రాంతాల్లో మహిళల వ్యక్తిగత ప్రయాణాలు తగ్గడంతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు మహిళలకు సురక్షితమైన ప్రజా రవాణా అందుబాటులోకి రావడం.. మరోవైపు ప్రయాణ ఖర్చు తగ్గడం.. రెండు ప్రయోజనాలు ఒకేసారి కలుగుతున్నాయి.

పొరుగు రాష్ట్రాల కంటే విస్తృత పరిధి

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అయితే ఏపీలో ఈ పథకాన్ని ఐదు రకాల బస్సుల్లో అమలు చేస్తుండటం ప్రత్యేకతగా ప్రభుత్వం పేర్కొంటోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇదే తరహా పథకం నాలుగు కేటగిరీల బస్సుల్లో అమలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే మహిళలకు కూడా స్త్రీ శక్తి పథకం విస్తృత ప్రయోజనం కల్పిస్తోంది.

‘స్వేచ్ఛగా ప్రయాణం.. ఆత్మగౌరవంతో జీవనం’

మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వెనుక కేవలం ఛార్జీ భారాన్ని తగ్గించడమే లక్ష్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. మహిళలు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా ప్రయాణించగలగడం.. తమకు అవసరమైన చోటుకు వెళ్లగలగడం.. ఉపాధి, విద్య, వైద్య అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా వారి ఆత్మవిశ్వాసం పెరగడమే స్త్రీ శక్తి పథకం ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటోంది.

అందుకే పథకానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం “స్త్రీ శక్తికి సంవత్సరం–రెట్టింపైన ఆత్మగౌరవం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

మహిళలతో సీఎం ముఖాముఖి

స్త్రీ శక్తి పథకానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మహిళా లబ్ధిదారులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజధాని పరేడ్ గ్రౌండ్ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు మహిళా లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి బస్సులో ప్రయాణించనున్నారు.

ఆ తర్వాత క్యాంపు కార్యాలయంలో మహిళలతో కలిసి హై-టీ కార్యక్రమంలో పాల్గొంటారు. పథకం ద్వారా వారికి కలుగుతున్న ప్రయోజనాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రయాణ అనుభవాలు, వారి అభిప్రాయాలను ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకోనున్నారు.

ఆత్మగౌరవం నుంచి ఆర్థిక సాధికారత దిశగా

ఒక ఏడాది.. 87 కోట్ల ప్రయాణాలు.. రోజుకు 24 లక్షల మంది మహిళలు.. రూ.3,095 కోట్ల ప్రభుత్వ వ్యయం. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదు.. ప్రజా రవాణా ద్వారా మహిళల జీవితాల్లో వస్తున్న మార్పుకు సూచికలు.

ఉచిత ప్రయాణంతో మహిళల చేతిలో మిగిలే ప్రతి రూపాయి.. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితికి తోడ్పడుతోంది. బస్సెక్కే ప్రతి మహిళకు లభిస్తున్న ప్రయాణ స్వేచ్ఛ.. ఆమె నిర్ణయ స్వాతంత్య్రాన్ని కూడా పెంచుతోంది.

అందుకే ‘స్త్రీ శక్తి’ ఏడాది వేడుకలు కేవలం ఒక ప్రభుత్వ పథకం వార్షికోత్సవంగా కాకుండా.. మహిళల ప్రయాణ స్వేచ్ఛ, ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారతకు మరో అడుగుగా నిలుస్తున్నాయి. వచ్చే రోజుల్లో ఈ పథకం మరింత మంది మహిళలకు చేరువైతే.. ఉచిత ప్రయాణం నుంచి ఆర్థిక స్వావలంబన వరకు దాని ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story