Amaravati: 'ఆవో ఉర్దూ సీఖే'.. భాషాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట
Amaravati: ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మే 1 నుండి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఉర్దూ కోచింగ్ క్యాంపులు నిర్వహించనున్నారు.
Amaravati: 'ఆవో ఉర్దూ సీఖే'.. భాషాభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట
Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో ఉర్దూ భాషాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో “ఉచిత కోచింగ్ క్యాంప్ – ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమాన్ని మే 1 నుంచి మే 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఉర్దూ భాషను అందరికీ చేరువ చేయడం, భాషా పరిరక్షణతో పాటు కొత్త తరానికి ఉర్దూ నేర్చుకునే అవకాశాన్ని కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విజయవాడ మొగల్‌రాజ్‌పురంలో ఉన్న ఉర్దూ అకాడమీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫరూఖ్ షుబ్లీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ భాషాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, మైనారిటీ సంక్షేమ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ మార్గదర్శకత్వంలో “ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఉర్దూ భాష కేవలం ఒక వర్గానికి పరిమితమైనది కాదని, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన మధురమైన భాషగా దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.
ప్రస్తుతం ఉర్దూ భాషపై యువతలో ఆసక్తి పెరుగుతోందని, ఈ ఉచిత కోచింగ్ క్యాంప్ ద్వారా మరింత మందికి నేర్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు, ఉర్దూ భాషపై ఆసక్తి ఉన్న వారందరికీ ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడుతుందని చెప్పారు. అలాగే ఉర్దూ అకాడమీ లిటరరీ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన “రండి ఉర్దూ నేర్చుకుందాం” అనే పుస్తకాన్ని కూడా త్వరలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పుస్తకాన్ని మైనారిటీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ పుస్తకం ద్వారా ప్రారంభ స్థాయి నుంచి సులభంగా ఉర్దూ నేర్చుకునేలా రూపకల్పన చేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ గౌస్ పీర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బానీ కూడా పాల్గొన్నారు. కార్యక్రమ విజయవంతానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇక ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, ఉర్దూ ప్రేమికులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. భాషల మధ్య సౌహార్దం పెంపొందించడంలో ఉర్దూ కీలక పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. “ఆవో ఉర్దూ సీఖే” కార్యక్రమం భాషా పరిరక్షణకు మాత్రమే కాకుండా, ఉర్దూను ప్రజల్లో మరింత విస్తరింపజేసే వేదికగా నిలవనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.




