Amaravati: గోదావరి డెల్టా ఆధునీకరణే మా లక్ష్యం అసెంబ్లీలో మంత్రి నిమ్మల!
Amaravati: గోదావరి పశ్చిమ డెల్టా, యనమదురు డ్రైన్ ఆధునీకరణపై అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన. 2029 నాటికి పనులు పూర్తి.
Amaravati: గోదావరి డెల్టా ఆధునీకరణే మా లక్ష్యం అసెంబ్లీలో మంత్రి నిమ్మల!
Amaravati: గోదావరి పశ్చిమ డెల్టాలో కీలకమైన డ్రైన్లు, కాలువల ఆధునీకరణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో వెల్లడించారు. యనమదురు డ్రైన్ సామర్థ్యం పెంపు, ఉప్పుటేరు అభివృద్ధి, గోదావరి డెల్టా ఆధునీకరణతో పాటు రాజోలు నియోజకవర్గంలోని కేశనపల్లి కెనాల్, శంఖరగుప్తం డ్రైన్ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
గోదావరి పశ్చిమ డెల్టాలో యనమదురు డ్రైన్ అత్యంత కీలకమైనదని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 23 వేల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యం ఉన్న ఈ డ్రైన్‌కు వరద సమయంలో సామర్థ్యానికి మించి నీరు వస్తోందన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రైన్ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మొత్తం 86 ఇన్‌లెట్లలో 70 శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటిలో 10 ఇన్‌లెట్ల పునర్నిర్మాణానికి ఇప్పటికే రెండు విడతల్లో రూ.3.2 కోట్లు కేటాయించామని తెలిపారు.
యనమదురు డ్రైన్ ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఉప్పుటేరు అభివృద్ధికి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గోదావరి డెల్టాలోని కాలువలు, డ్రైన్ల సమగ్ర ఆధునీకరణ కోసం రూ.14 కోట్లు కేటాయించి లైడార్ సర్వే పూర్తి చేశామని, డీపీఆర్ తయారీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఇరిగేషన్ క్యాలెండర్‌లో గోదావరి డెల్టా ఆధునీకరణను కూడా చేర్చినట్లు తెలిపారు. 2029లోపు మూడేళ్లలోనే డెల్టా ఆధునీకరణ పనులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి వ్యవస్థల నిర్వహణపై నిర్లక్ష్యం జరిగిందని మంత్రి విమర్శించారు. 2019-24 మధ్య ఓఅండ్ఎం పనులకు తగిన నిధులు కేటాయించకపోవడంతో డీసిల్టింగ్, లాకులు, షట్టర్లు, రోపుల మరమ్మతులు నిర్లక్ష్యానికి గురయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.1,100 కోట్లకు పైగా నిధులు కేటాయించి ఓఅండ్ఎం పనులు చేపట్టామని వివరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 2,686 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టుకు అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. సముద్రపు నీరు కొబ్బరి పంట ఆధారిత గ్రామాల్లోకి చొచ్చుకురావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనికి ప్రత్యామ్నాయంగా ఆయా గ్రామాలకు మంచినీరు అందించేందుకు రూ.50 కోట్లతో కేశనపల్లి కెనాల్ ప్రాజెక్టును ప్రతిపాదించామని చెప్పారు.
శంఖరగుప్తం డ్రైన్ సమస్యపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. సముద్రపు నీరు డ్రైన్ ద్వారా లోపలికి రావడంతో వేలాది ఎకరాల్లో కొబ్బరి పంట దెబ్బతిన్న విషయాన్ని రైతులు, ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ నిపుణులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అనంతరం మరో రెండు సార్లు సమీక్షలు నిర్వహించిన తర్వాత రూ.21 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషితో ఆర్థిక శాఖ నుంచి నిధులు సాధించి పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే శంఖరగుప్తం డ్రైన్ పనులు 25 శాతం పూర్తయ్యాయని, మే 2027 నాటికి మొత్తం పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
గోదావరి డెల్టా రైతాంగానికి సాగునీరు, డ్రైనేజీ, ఉప్పునీటి సమస్యల నుంచి శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.




