Amaravati: ఏపీపీఎస్సీ గ్రూప్-1 వివాదంపై లంచ్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక చర్చ!

Amaravati: గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో నిర్వహించిన లంచ్ భేటీలో తీవ్ర చర్చ.

Hari Kishan  AP Bureau Chief
Published on: 13 Aug 2026 5:02 PM IST
Amaravati
X

Amaravati: ఏపీపీఎస్సీ గ్రూప్-1 వివాదంపై లంచ్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక చర్చ!

Amaravati: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 జవాబు పత్రాల మూల్యాంకనం వ్యవహారం రాజకీయంగా వేడెక్కుతోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉన్న మంత్రులతో నిర్వహించిన లంచ్‌ భేటీలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. గ్రూప్‌-1 పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా నిలదీయాలని మంత్రులు నిర్ణయించినట్లు తెలుస్తోంది...

జవాబు పత్రాల్లో 97 శాతం మూల్యాంకనం పూర్తయిన తీరుపై ముఖ్యమంత్రి, మంత్రులు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం. డేటా ఎంట్రీ ఆపరేటర్లతో జవాబు పత్రాలు దిద్దించారనే వార్తలు పత్రికలు, టీవీ ఛానళ్లలో రావడంపై సమావేశంలో చర్చ జరిగింది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసి తమకు అనుకూలమైన వారికి ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయా అన్న కోణంలో లోతైన దర్యాప్తు అవసరమని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది...

సిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాలతో పాటు అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పాత్ర, మరికొందరు అధికారుల వ్యవహారంపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గ్రూప్‌-1లో తమ వారికి ఉద్యోగాలు ఇప్పించుకోవడం వెనుక ఎవరెవరి పాత్ర ఉందో తేలాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం.

అయితే సిట్ నివేదిక కోర్టు పరిధిలో ఉన్నందున న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉంటుందో చూద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది.

2011లో మహారాష్ట్రలో ఇలాంటి పరిణామం చోటుచేసుకున్నప్పుడు అభ్యర్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయాన్ని కూడా మంత్రులు గుర్తుచేసినట్లు సమాచారం. తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన గ్రూప్‌-1 అభ్యర్థులతో మాట్లాడితే మరింత సమాచారం లభిస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించినట్లు తెలిసింది. వారితో వెంటనే మాట్లాడి పూర్తి వివరాలు సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం...

ఇదే సమయంలో డీఎస్సీ వ్యవహారంపై వైసీపీ మండలిలో ఆరోపణలు చేస్తే ధీటుగా సమాధానం ఇవ్వాలని చంద్రబాబు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. వైసీపీ చేసే ప్రతి ఆరోపణకు సాక్ష్యాధారాలతో అగ్రెసివ్‌గా కౌంటర్ ఇవ్వాలని, కేవలం ఆరోపణలు చేసి వెళ్లిపోతామంటే కుదరదని స్పష్టం చేసినట్లు సమాచారం. డీఎస్సీపై మండలిలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆరోపణలు చేసేవారు ఆధారాలు తీసుకురావాలని సవాల్ చేయాలని కూడా ముఖ్యమంత్రి సూచించినట్లు తెలుస్తోంది.

అధికారులు ఇప్పటికే అన్ని వివరాలు వెల్లడించినప్పటికీ కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తే రాజకీయంగా వదిలిపెట్టకూడదని మంత్రులు నిర్ణయించినట్లు సమాచారం.

గ్రూప్‌-1 పరీక్షల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై సమాచారం సేకరించే బాధ్యతను పోలీసు శాఖలోని కొంతమంది అధికారులకు ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు అమరావతి నిర్మాణ పనులపైనా భేటీలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. రాజధానిలో నిర్మాణాలు వేగం పుంజుకున్నాయని, ఇక వరుసగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు నిర్వహించాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. సైబరాబాద్ నిర్మాణం, హైదరాబాద్ ఓఆర్‌ఆర్, హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టుల నిర్మాణంలో తనకు ఉన్న అనుభవాలను మంత్రులతో పంచుకున్న చంద్రబాబు.. అదే తరహాలో అమరావతిని వేగంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని వివరించినట్లు తెలుస్తోంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story