Amaravati: ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ రవి సుభాష్!

Amaravati: ఏపీటీడీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ రవి సుభాష్ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిశారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 12 Aug 2026 3:04 PM IST
Amaravati
X

Amaravati: ఏపీటీడీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ రవి సుభాష్!

Amaravati: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి పట్టన్ శెట్టి రవి సుభాష్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి చేపట్టాల్సిన కీలక చర్యలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు...

నూతన ఎండీకి మంత్రి శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత ముందంజలో నిలిపేందుకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.

ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ ఎకో-టూరిజం, ఆరోగ్యం–ఆహ్లాదాన్ని అందించే వెల్‌నెస్ టూరిజం ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్‌షిప్ విధానంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, ఇప్పటికే కుదిరిన ఒప్పందాలు త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

నూతన పర్యాటక పాలసీ, అనుబంధ విధానాలపై సమగ్రంగా చర్చించిన మంత్రి.. పర్యాటక రంగ నిపుణులు, పెట్టుబడిదారుల నుంచి వచ్చిన సూచనలు, ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు, కమిటీ పరిధిలో ఆమోదం పొందిన పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపైనా సమీక్షించారు.

రాష్ట్ర పర్యాటక వైభవాన్ని దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ప్రాంతీయ పర్యాటక ఉత్సవాలను నిర్వహించాలని మంత్రి సూచించారు. దేశ, విదేశాల్లో ఏపీ టూరిజంకు విస్తృత ప్రచారం కల్పించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా, మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తానని ఏపీటీడీసీ ఎండీ పట్టన్ శెట్టి రవి సుభాష్ తెలిపారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.

Next Story