Amaravati: రైతు సంక్షేమంపై సజ్జలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్

Amaravati: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతు సంక్షేమంపై వైసీపీ విమర్శలను తిప్పికొట్టారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 25 April 2026 7:01 PM IST
Amaravati
X

Amaravati: రైతు సంక్షేమంపై సజ్జలకు మంత్రి అచ్చెన్నాయుడు కౌంటర్

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి అంశంపై రాజకీయ వేడి మరింత పెరిగింది. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా సమాధానం ఇచ్చారు. రైతుల సమస్యలకు అసలు కారణం వైసీపీ పాలనేనని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలిచి వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెడుతోందని స్పష్టం చేశారు.

వైసీపీ హయాంలో రైతు పరిస్థితి అత్యంత దారుణంగా మారిందనీ. పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, సరైన సమయంలో విత్తనాలు, ఎరువులు అందకపోవడం, సాగునీటి సమస్యలు, అప్పుల భారం… ఇవన్నీ రైతును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని విమర్శించారు మంత్రి అచ్చం నాయుడు. రైతులు రోడ్డెక్కి నిరసనలు చేసిన ఘటనలను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదన్నారు. కేవలం కాగితాలపై కేటాయింపులు చూపించి, వాస్తవంగా రైతులకు సహాయం చేయకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిందని మంత్రి చెప్పారు. కనీస మద్దతు ధర (MSP) అమలులో ప్రభుత్వం కట్టుబడి ఉందని, ధరల స్థిరీకరణ నిధి (PSF) ద్వారా రైతులకు ప్రత్యక్ష సహాయం అందిస్తున్నామని వెల్లడించారు. 2025–26లో రూ.300 కోట్ల కేటాయింపుతో ప్రారంభమైన ఈ సహాయం, మొత్తం రూ.588 కోట్లకు చేరిందన్నారు. ఇందులో పోగాకు రైతులకు రూ.240 కోట్లు, మామిడి రైతులకు రూ.190 కోట్లు, ఉల్లి కొనుగోలుకు రూ.17.20 కోట్లు, ఉల్లి నష్టపరిహారంగా రూ.128.33 కోట్లు, కోకో రైతులకు రూ.12 కోట్లు అందించామని వివరించారు.

ప్రత్యేకంగా ఉల్లి రైతులకు గతంలో హెక్టారుకు రూ.25 వేల నష్టపరిహారం మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాన్ని రూ.50 వేల వరకు పెంచి రైతులకు ఉపశమనం కల్పించామని చెప్పారు. అలాగే మొక్కజొన్న రైతుల సమస్యపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో నిరంతరం చర్చలు జరుపుతూ రైతులకు అనుకూల నిర్ణయం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తి గణాంకాలను కూడా అచ్చెన్నాయుడు ప్రస్తావించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో ఉత్పత్తి 143 నుంచి 175 లక్షల మెట్రిక్ టన్నుల మధ్యే ఉండిపోయి, 2023-24లో 143 లక్షల టన్నులకు పడిపోయిందన్నారు. ఇది వైసీపీ పాలన వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో 163 లక్షల టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2025-26 నాటికి 237 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని, అంటే దాదాపు 51 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.

ఉద్యాన రంగంలో కూడా రాష్ట్రం చరిత్రాత్మక పురోగతి సాధిస్తోందన్నారు. ముఖ్యంగా మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులను విస్తృతంగా అమలు చేస్తూ రైతులకు నీటి వినియోగంలో లాభం కలిగిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలిన రూ.881 కోట్ల బకాయిలను చెల్లించి ఉద్యాన రంగాన్ని బలోపేతం చేశామని వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, మరింత విస్తరణకు భారీ ప్రణాళికలు సిద్ధమయ్యాయని తెలిపారు.

రైతు సంక్షేమం పేరుతో ప్రచారం చేసిన వైసీపీ పాలనలో రైతు నష్టపోయాడని, కానీ కూటమి పాలనలో రైతు మళ్లీ నిలబడుతున్నాడని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అబద్ధాల ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవని, రైతు వాస్తవాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటాడని ఆయన హెచ్చరించారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story