Amaravati: జగన్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి

Amaravati: జగన్ ఓ అపరిచితుడు.. గొడ్డలి పార్టీ అధ్యక్షుడు! జగన్ ప్రెస్ మీట్ ఆరోపణలపై మంత్రి అచ్చెన్నాయుడు పాత చరిత్రను తవ్వుతూ గుప్పించిన సంచలన విమర్శల వేడి.

Hari Kishan  AP Bureau Chief
Updated on: 22 May 2026 6:02 PM IST
Amaravati
X

Amaravati: జగన్ వ్యాఖ్యలకు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ మంత్రి

Amaravati: అమరావతిలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. హత్యా రాజకీయాలంటూ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు.మీడియా సమావేశం లో మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించడమే కాకుండా, వ్యక్తిగతంగా, రాజకీయంగా కూడా ఘాటు విమర్శలు గుప్పించారు.

సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం మంచి పాలన అందిస్తుంటే దాన్ని తట్టుకోలేకే జగన్ వ్యక్తిగత ఆరోపణలకు దిగారని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రెండేళ్ల పాలనలో విమర్శించడానికి ప్రజా సమస్యలు కానీ, ప్రభుత్వ వైఫల్యాలు కానీ దొరకకపోవడంతో వ్యక్తిగత ఆరోపణల దారిని ఎంచుకున్నారన్నారు. జగన్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపించిందనీ దుయ్య బట్టారు.

జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యల్లో ఒకటి ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. జగన్ లాంటి స్వభావం ఉన్న వ్యక్తులు వస్తారని ముందే గుర్తించి దర్శకుడు శంకర్ "అపరిచితుడు" సినిమా తీశారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రవర్తన, ఆలోచనా విధానం చూసి అలా అనిపిస్తోందని చెప్పారు. అంతేకాదు, జగన్‌ను "గొడ్డలి పార్టీ అధ్యక్షుడు"గా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొడ్డలి పార్టీ సమాజానికి ప్రమాదకరమని, రాజకీయ ముసుగులో ఉన్న ఫ్యాక్షనిస్టు అని ఆరోపించారు. జగన్ రాజకీయాల వెనుక విభజన భావజాలం ఉందని విమర్శించారు.

జగన్ వ్యాఖ్యలతో ఇప్పుడు నాటి చరిత్ర మళ్లీ చర్చకు వస్తోందని అచ్చెన్నాయుడు అన్నారు. ముఖ్యంగా రాజారెడ్డి దమనకాండ, వైఎస్ కుటుంబ చరిత్ర, పాత రాజకీయ సంఘటనలు మళ్లీ ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయని పేర్కొన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యల వల్ల నేటి తరానికి వైఎస్ కుటుంబ నేపథ్యం తెలిసే పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాజారెడ్డి హత్య కేసును కూడా ప్రస్తావించిన అచ్చెన్నాయుడు, ఆ కేసులో నిందితులుగా ఉన్న వారిని చంపేశారని, ఒక్క పార్థసారథి రెడ్డి మాత్రమే మిగిలారని వ్యాఖ్యానించారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ప్రస్తుతం వైసీపీలో కీలక హోదాలో ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఇక వివేకానందరెడ్డి హత్య వ్యవహారంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య ఎలా జరిగిందో, ఎవరు చేశారో అందరికీ తెలుసని అన్నారు. ఈ కేసులో జగన్ ప్రమేయం ఉందని సునీతమ్మ ఆరోపిస్తున్నారని, దానికి సమాధానం చెప్పగలరా అని ప్రశ్నించారు. రాజారెడ్డి నుంచి వివేకా మరణం వరకు జరిగిన ప్రతి ఘటనలో ప్రధాన లబ్దిదారు జగన్ మోహన్ రెడ్డేనని ఆరోపించారు.

మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిపై కూడా అచ్చెన్నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరికీ హిందూ దేవుళ్లపై ఎందుకు కక్ష ఉందో అర్థం కావడం లేదన్నారు. ఏడు కొండల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ ఇప్పుడు తెరపైకి తీసుకువస్తున్నారని చెప్పారు.

వైఎస్సార్ మరణంపై కూడా అచ్చెన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ను జగన్ చంపారని తాను చెబితే బొత్స సత్యనారాయణ కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. బొత్స ఎందుకు అలా స్పందించారో ఇప్పటికీ అర్థం కాలేదని వ్యాఖ్యానించారు.

రిలయన్స్ సంస్థలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, దాడులు చేయించి తర్వాత అదే సంస్థలకు రాజ్యసభ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే కోడి కత్తి ఘటన, తండ్రి మరణం, బాబాయ్ హత్య అంశాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

రంగా హత్య కేసును కూడా ప్రస్తావిస్తూ, ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి కుటుంబ సభ్యులు ఇప్పుడు జగన్ పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల్లో స్వాగతాలు, వీడ్కోలు కార్యక్రమాలు కూడా వారే నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

అచ్చెన్న తన వ్యక్తిగత అనుభవాలను కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, ఆరోగ్యం బాగోలేకున్నా ఇబ్బందులు పెట్టారని అన్నారు. చంద్రబాబును నోటీసులు ఇవ్వకుండా 53 రోజులు జైలులో పెట్టారని గుర్తు చేశారు. పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీని కూడా చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు.

రఘు రామ కృష్ణం రాజు ప్రాణాలు కోర్టుల వల్లే దక్కాయని అచ్చెన్న పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తల్లి, చెల్లిని కూడా వదలకుండా అసభ్య వ్యాఖ్యలు చేయించారని మండిపడ్డారు.

డాక్టర్ సుధాకర్ మరణం, రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ ఘటన, నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబ ఘటనలను కూడా గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తల ప్రాణాలు తీసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు.

అమరావతి అభివృద్ధిని కూడా ప్రస్తావిస్తూ, అమరావతికి రాజముద్ర పడిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి జరుగుతోందని, దాన్ని జగన్ తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.

చివరగా జగన్‌పై వ్యక్తిగత స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, జగన్‌ను సైకో అనాలా, పిచ్చోడు అనాలా అర్థం కావడం లేదన్నారు. విశాఖలో నిర్మించిన ప్యాలెస్‌పై ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు, అమరావతిలో నిర్మిస్తున్న రోడ్ల మధ్య తేడా ఉండదా అని ప్రశ్నించారు.

మొత్తంగా అచ్చెన్నాయుడు ప్రెస్‌మీట్ పూర్తిగా జగన్‌పై విమర్శలతో నిండిపోయింది. ఆరోపణలకు ప్రతి ఆరోపణతోనే సమాధానం ఇస్తామన్న సంకేతాన్ని టీడీపీ నేతలు ఇచ్చినట్లుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

Next Story