AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం!

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అక్టోబర్ 13న అండమాన్ సముద్రంలో ఏర్పడే అవకాశం 15 నాటికి వాయుగుండంగా మారే ఛాన్స్.. ఏపీలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Oct 2026 10:05 PM IST
AP
X

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం!

AP: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. అయితే అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనం, తీవ్రతపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

శనివారం పలు జిల్లాల్లో వర్షాలు

మరోవైపు శనివారం (అక్టోబర్ 3) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

మిగతా కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనానికి సంబంధించిన తాజా పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వ్యవస్థ ఏర్పడిన తర్వాత దాని కదలిక, తీవ్రత, ఏ ప్రాంతాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంశాలపై మరింత స్పష్టమైన సమాచారం అందనుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.