Amaravati: జీవో నెం. 444, 588 మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి!
Amaravati: సెక్షన్ 22-A నుంచి ప్రైవేట్ భూములను తొలగించాలి సీఎం చంద్రబాబుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ విజ్ఞప్తి.. జీవో 444, 588 తక్షణమే అమలు చేయాలని డిమాండ్.
Amaravati: జీవో నెం. 444, 588 మార్గదర్శకాలను వెంటనే అమలు చేయాలి!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సెక్షన్ 22-A పరిధిలో భూములు చేర్చబడటం వల్ల అనేక మంది రైతులు, భూ యజమానులు తమ ఆస్తులను విక్రయించుకోలేక, రిజిస్ట్రేషన్ చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్. మాధవ్ తెలిపారు. ముఖ్యంగా చట్టపరంగా ఎలాంటి నిషేధం వర్తించని ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములు పొరపాటున లేదా పాత రికార్డుల ఆధారంగా 22-A జాబితాలో కొనసాగుతున్న సందర్భాల్లో భూ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
22-A జాబితాను శాస్త్రీయంగా సమీక్షించి, అర్హత లేని భూములను గుర్తించి తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన స్వాగతించారు. G.O.Ms.No.444, Revenue (Registration-I), dated 22-07-2026, అలాగే G.O.Ms.No.588, Revenue Department, dated 15-09-2026లో జారీ చేసిన మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో తక్షణమే అమలు చేయాలని కోరారు. తద్వారా 22-A నిషేధిత ఆస్తుల డేటాబేస్‌ను సమగ్రంగా నిర్వహించడంతో పాటు, రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేసి అర్హత కలిగిన భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు.
ఒకే సర్వే నంబర్‌కు సంబంధించిన డూప్లికేట్, పాత లేదా ఆధారాలు లేని 22-A ఎంట్రీలను సమగ్రంగా పరిశీలించి తొలగించాలని, జిల్లా స్థాయిలో ప్రత్యేక కాలపరిమితి నిర్ణయించి పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఒక భూమి 22-A జాబితాలో ఎందుకు ఉందో, దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు, గెజిట్ లేదా ఇతర రికార్డుల వివరాలను భూ యజమానులకు ఆన్‌లైన్‌లో పారదర్శకంగా అందుబాటులో ఉంచాలని సూచించారు.
అదే సమయంలో ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్ తదితర చట్టపరంగా రక్షించాల్సిన భూములను కాపాడుతూ, అర్హత లేని భూములు 22-A జాబితాలో కొనసాగకుండా స్పష్టమైన పరిశీలనా విధానాన్ని అమలు చేయాలని మాధవ్ కోరారు. 22-A నుంచి భూమిని తొలగించేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి విచారణ, నిర్ణయం, అప్పీల్ ప్రక్రియలకు స్పష్టమైన కాలపరిమితి నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ధృవీకరణ పూర్తయి, రిజిస్ట్రేషన్‌కు చట్టపరంగా అర్హత ఉన్న భూములకు వెంటనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, జిల్లా వారీగా 22-A నుంచి తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులకు భూమి కుటుంబ ఆర్థిక భద్రతకు కీలకమైన ఆస్తి అని, చట్టపరంగా రక్షించాల్సిన భూములను కాపాడుతూనే అర్హత కలిగిన భూములపై అనవసరమైన రిజిస్ట్రేషన్ ఆంక్షలను తొలగించడం ద్వారా రైతులు, భూ యజమానులకు న్యాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కోరారు.




