AP: సంస్థాగత పటిష్టతకు కార్యాచరణ.. అనుబంధ మోర్చాల బలోపేతంపై బీజేపీ దృష్టి!
AP: విజయవాడలో బీజేపీ అనుబంధ మోర్చాల కీలక భేటీ క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర ఇంఛార్జ్ అరవింద్ బదౌరియా పిలుపు.
AP: సంస్థాగత పటిష్టతకు కార్యాచరణ.. అనుబంధ మోర్చాల బలోపేతంపై బీజేపీ దృష్టి!
AP: ఆంధ్రప్రదేశ్లో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావడానికి అనుబంధ మోర్చాల కార్యకలాపాలను విస్తృతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ, సామాజిక అవకాశాలను పార్టీకి అనుకూలంగా మలుచుకునేలా అనుబంధ సంఘాలకు స్పష్టమైన కార్యాచరణ రూపొందించారు.
విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా మోర్చాల పనితీరు, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల విస్తరణ, గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అరవింద్ బదౌరియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో పార్టీకి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. అనుబంధ మోర్చాలు బలంగా ఉంటేనే పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్టం అవుతుందని అన్నారు. ప్రతి మోర్చా తనకు కేటాయించిన వర్గాల్లో విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువ కావాలని సూచించారు.
ప్రతి గ్రామంలో అనుబంధ మోర్చాల నెట్వర్క్ను విస్తరించాలని అరవింద్ బదౌరియా పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీకి అనుబంధ సంఘాల నిర్మాణం బలంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అన్నారు.
అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని సూచించారు. అనుబంధ మోర్చాలకు చెందిన కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామాలు, మండలాలు, పట్టణాల్లో పార్టీకి బలమైన ప్రాతినిధ్యం కల్పించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
సామాజిక వర్గాలు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు, వృత్తి వర్గాలతో అనుబంధ మోర్చాలు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకోవాలని సూచించారు.
బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ వనతి శ్రీనివాసన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ తదితరులు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు.
అనుబంధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇన్ఛార్జ్లు తమ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలు, సంస్థాగత పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో గ్రామస్థాయి వరకు మోర్చాల కార్యకలాపాలను విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకత్వం దిశానిర్దేశం చేసింది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం సాగింది.




