Vijayawada: ఖాదీ సంతతో స్వదేశీ సందేశం, స్వదేశీ ఉత్పత్తులే దేశ ఆర్థిక బలం..బిజెపి!

Vijayawada: విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో ఖాదీ సంత ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ఇంఛార్జి అరవింద్ సింగ్ భదోరియా స్వదేశీ ఉత్పత్తులతోనే దేశ ఆర్థిక స్వావలంబన సాధ్యమని పిలుపు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 2 Oct 2026 8:12 PM IST
Vijayawada
X

Vijayawada: ఖాదీ సంతతో స్వదేశీ సందేశం, స్వదేశీ ఉత్పత్తులే దేశ ఆర్థిక బలం..బిజెపి!

విజయవాడ: స్వదేశీ ఉత్పత్తుల వినియోగంతోనే దేశ ఆర్థిక స్వావలంబన సాధ్యమని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఉత్పత్తులు, చేనేత, ఖాదీని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయవాడలోని ఐవీ ప్యాలెస్‌లో ఒకరోజు ఖాదీ సంత నిర్వహించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంఛార్జి అరవింద్ సింగ్ భదోరియా, రాష్ట్ర సహ ఇంఛార్జి వనతి శ్రీనివాసన్, ఏపీ–తెలంగాణ రాష్ట్రాల సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ ఖాదీ సంతను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ఖాదీ, చేనేత స్టాళ్లను సందర్శించారు.

భారతదేశానికి స్వదేశీ ఉత్పత్తుల వినియోగంలో సుదీర్ఘ చరిత్ర ఉందని అరవింద్ సింగ్ భదోరియా తెలిపారు. సింధు లోయ నాగరికత నుంచి స్వాతంత్ర్యానికి పూర్వం వరకు దేశ అవసరాలకు కావాల్సిన వస్త్రాలు, ఆహారం, ఇతర వస్తువులను దేశంలోనే ఉత్పత్తి చేసుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతులు కూడా జరిగేవని చెప్పారు. బ్రిటిష్ పాలనలో ముడిసరుకును భారత్ నుంచి తరలించి, విదేశాల్లో ఉత్పత్తులు తయారు చేసి తిరిగి భారత మార్కెట్‌లో విక్రయించడం ద్వారా దేశీయ పరిశ్రమలకు నష్టం కలిగించారని పేర్కొన్నారు.

ఈ పరిస్థితికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ స్వదేశీ, ఖాదీ ఉద్యమాలను ప్రజా ఉద్యమాలుగా మలిచారని భదోరియా గుర్తుచేశారు. స్వదేశీ ఉత్పత్తులను స్వీకరించడం ద్వారా దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకెళ్లాలన్న గాంధీజీ సందేశం స్వాతంత్ర్యోద్యమంలో కీలకంగా మారిందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘లోకల్ ఫర్ వోకల్’కు ప్రాధాన్యత ఇస్తోందని భదోరియా తెలిపారు. స్థానిక తయారీదారులు, కళాకారులు, కార్మికులకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విదేశీ వస్తువుల దిగుమతులను తగ్గించి భారతీయ ఉత్పత్తుల ఎగుమతులను పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

గాంధీజీ ఆశయాలను కేవలం గుర్తు చేసుకోవడం కాకుండా వాటిని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర సహ ఇంఛార్జి వనతి శ్రీనివాసన్ అన్నారు. ‘వికసిత్ భారత్’, ‘లోకల్ ఫర్ వోకల్’ వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. భారతీయ కళలు, చేనేత, సంప్రదాయ వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకమైన సాంస్కృతిక వారసత్వంతో పాటు నైపుణ్యం కలిగిన నేతన్నలు, కళాకారులు ఉన్నారని వనతి శ్రీనివాసన్ చెప్పారు. కలంకారీ, శ్రీకాళహస్తి కళారూపాలకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన ఉత్పత్తిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ‘వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్’ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వివరించారు. ప్రజలు తమ దుస్తుల కొనుగోళ్లలో కనీసం 30 శాతం చేనేత వస్త్రాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు.

ఖాదీని కేవలం వస్త్రంగా కాకుండా ఫ్యాషన్‌గా మార్చడంలో మోదీ ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని ఏపీ–తెలంగాణ సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ అన్నారు. సంప్రదాయ వృత్తులు, కళలు, చేనేత రంగాన్ని పరిరక్షించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని తెలిపారు.

ఖాదీకి దేశవ్యాప్తంగా విస్తృత ప్రాచుర్యం లభించిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. స్వదేశీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఖాదీ సంతలు వంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీతతో పాటు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.