Vijayawada: గాంధీ జయంతి వేళ విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో 'ఖాదీ సంత'!

Vijayawada: అక్టోబర్ 2న విజయవాడ ఐవీ ప్యాలెస్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంత, ఎగ్జిబిషన్. ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 30 Sept 2026 3:11 PM IST
Vijayawada
X

Vijayawada: గాంధీ జయంతి వేళ విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో 'ఖాదీ సంత'!

Vijayawada: గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ, చేనేత ఉత్పత్తులను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంత నిర్వహించనున్నారు. “ఖాదీ ఫర్ నేషన్.. ఖాదీ ఫర్ ఫ్యాషన్” నినాదంతో అక్టోబర్ 2న విజయవాడలో ఈ కార్యక్రమం జరగనుంది. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ సంతకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నేతృత్వం వహించనున్నారు. జాతీయ పార్టీ నియమించిన రాష్ట్ర ఇన్‌చార్జీలు కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు.

విజయవాడ ఐవీ ప్యాలెస్ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఖాదీ ఎగ్జిబిషన్, సంత నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక తెలిపారు. ఉదయం, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, జిల్లా కేంద్రాల్లో ఖాదీ సంతలు నిర్వహించామని, విజయవాడలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై ప్రోత్సహించారని ఆమె గుర్తుచేశారు.

ఖాదీ అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదని.. స్వదేశీ, స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీక అని రేణుక పేర్కొన్నారు. 1905 స్వదేశీ ఉద్యమం నుంచి స్వాతంత్ర్య పోరాటంలో ఖాదీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చరఖాపై నూలు వడకడం, ఖాదీ ధరించడం అప్పట్లో జాతీయ ఉద్యమానికి ప్రతీకగా నిలిచాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలకు ఖాదీ, చేనేత ఉపాధి, ఆదాయంతో పాటు ఆత్మగౌరవానికి ఆధారంగా నిలుస్తున్నాయని వివరించారు.

వ్యవసాయం తర్వాత అధిక స్థాయిలో ఉపాధి కల్పించే రంగాల్లో టెక్స్‌టైల్, చేనేత రంగాలు కీలకమైనవని రేణుక అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ, హ్యాండ్లూమ్, గ్రామీణ, కుటీర పరిశ్రమలకు మార్కెటింగ్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్, ఆర్థిక సహాయం వంటి అంశాల్లో ప్రాధాన్యత పెరిగిందన్నారు. 2013–14లో సుమారు 33 వేల కోట్ల రూపాయలుగా ఉన్న ఖాదీ రంగం టర్నోవర్ ప్రస్తుతం సుమారు 1.7 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ చేనేత రంగానికి కూటమి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సహకరిస్తోందని తెలిపారు. నేతన్న హస్తం, నేతన్న పెన్షన్, విద్యుత్ రాయితీలు, రుణాలు, సబ్సిడీలు, గ్రాంట్ల ద్వారా చేనేత కుటుంబాలకు మద్దతు అందుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్ లభించిందని, మంగళగిరి, వెంకటగిరి వంటి హ్యాండ్లూమ్ క్లస్టర్లను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

విదేశీ ప్రతినిధులు, ప్రముఖులకు ఖాదీ, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులను బహుమతులుగా అందించడం ద్వారా ‘వోకల్ ఫర్ లోకల్’కు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌ను చేరే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు.

ఖాదీకి ఉన్న ప్రత్యేకమైన నేయు విధానం వల్ల వేసవిలో చల్లదనాన్ని, చలికాలంలో సహజమైన వెచ్చదనాన్ని అందించే లక్షణం ఉందని రేణుక తెలిపారు. భారతీయ ఖాదీకి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పెరుగుతోందన్నారు.

అందుకే అక్టోబర్ 2న నిర్వహించే ఖాదీ సంతకు ప్రజలు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి హాజరై చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రేణుక విజ్ఞప్తి చేశారు. ఖాదీ, చేనేత ఉత్పత్తుల కొనుగోలు ద్వారా నేతన్నలు, వారి కుటుంబాలకు ప్రత్యక్షంగా భరోసా కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.