AP: ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీపై మంత్రుల భేటీ!
AP: వెలగపూడి సచివాలయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అధ్యక్షతన ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది.
AP: ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీపై మంత్రుల భేటీ!
AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా వ్యాజ్యాల నిర్వహణకు సంబంధించి సమగ్ర విధానాన్ని రూపొందించే దిశగా ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధివిధానాల ఖరారు కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం వెలగపూడి సచివాలయంలో సమావేశమైంది. న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి ప్రత్యక్షంగా హాజరయ్యారు. హోంమంత్రి వంగలపూడి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీష్ కుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు న్యాయశాఖ ఉన్నతాధికారులతో పబ్లిక్ లిటిగేషన్ పాలసీపై విస్తృతంగా చర్చించారు. గతంలో జరిగిన ఉపసంఘం సమావేశాల్లో చేసిన సూచనలు, సమీక్ష అంశాలను పరిగణనలోకి తీసుకుని పాలసీ ముసాయిదా రూపకల్పనపై చర్చ జరిగింది. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ప్రజా వ్యాజ్య విధానాలను అధ్యయనం చేసిన న్యాయశాఖ అధికారులు, ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను ఉపసంఘం దృష్టికి తీసుకువచ్చారు.
పబ్లిక్ లిటిగేషన్ పాలసీ అమలులో ఉన్న ఇతర రాష్ట్రాల్లో న్యాయశాఖ అధికారులు చేపట్టిన అధ్యయన పర్యటనలకు సంబంధించిన వివరాలను న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి మంత్రులకు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో కేసుల నిర్వహణ, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం, కోర్టు కేసుల పర్యవేక్షణ, వివాదాల పరిష్కారానికి అనుసరిస్తున్న విధానాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ న్యాయశాఖలో అనవసర వ్యాజ్యాలను తగ్గించడం, కోర్టు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడం, సకాలంలో ప్రభావవంతమైన వివాద పరిష్కారాన్ని నిర్ధారించడం పాలసీ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలను ఏర్పాటు చేయడం, వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేలా విధానాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాలసీ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు, నోడల్ అధికారుల నియామకం, ఆన్‌లైన్ పోర్టల్ ఏర్పాటుపైనా దృష్టి పెట్టాలని సూచించారు. న్యాయశాఖను మరింత పటిష్టం చేసేలా ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి ఫరూక్ తెలిపారు. త్వరలోనే ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ ముసాయిదాను రూపొందించి తదుపరి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు మంత్రి వెల్లడించారు.




