మురసు తుపాను నష్టం రూ.2,484 కోట్లు,కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక.. తక్షణ సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి..

Amaravati: మురసు తుపానుతో ఏపీలో రూ. 2,484 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, తక్షణమే ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర బృందాన్ని కోరారు.

Hari Kishan  AP Bureau Chief
Published on: 15 Nov 2026 6:53 PM IST
Amaravati
X

మురసు తుపాను నష్టం రూ.2,484 కోట్లు,కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక.. తక్షణ సాయం అందించాలని చంద్రబాబు విజ్ఞప్తి..

అమరావతి: మురసు తుపాను ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వ్యవసాయం నుంచి మౌలిక వసతుల వరకు పలు రంగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో పంట పొలాలు నీటమునగడం, రహదారులు కొట్టుకుపోవడం, కాలువలకు గండ్లు పడటం, విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో వర్చువల్ సమావేశమై నష్టంపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం మురసు తుపానుతో దాదాపు రూ.2,484.43 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది. తక్షణమే కేంద్రం ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.

*నాలుగు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటన*

కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. రెండు బృందాలుగా విడిపోయి బాపట్ల, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. దాదాపు 60 ప్రాంతాల్లో పర్యటించి తుపాను ప్రభావాన్ని అంచనా వేసింది.

దెబ్బతిన్న పంట పొలాలు, సాగునీటి కాలువలు, రహదారులు, ఇళ్లు, విద్యుత్ వ్యవస్థలను పరిశీలించింది. బాధిత రైతులు, మత్స్యకారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంది. భీమడోలు మండలం సూరప్పగూడెంలో పంట నష్టంపై రైతులతో మాట్లాడిన బృందం సభ్యులు.. రావులపర్రులో డ్రెయినేజీ వ్యవస్థ, వరి పంటల పరిస్థితిని పరిశీలించారు. కునకలమర్రులో కొమ్ము కాలువ, రహదారులు, సాగునీటి వ్యవస్థకు జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.

చీరాలలో మత్స్యకారుల పడవలకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు. బొప్పూడిలో పక్కా ఇళ్లు, ఉద్యాన పంటలు, వ్యవసాయం, బాతుల పెంపకందారులకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఏడ్లపాడు–తుర్లపాడు మధ్య జలాది మీదుగా ఉన్న ఆర్ అండ్ బీ రహదారులను కూడా పరిశీలించారు.

*రూ.2,484 కోట్లకు పైగా నష్టం*

మురసు తుపాను కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాలకు కలిపి రూ.2,484.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదిక అందించింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం, ఉద్యానవనాలు, రహదారులు, విద్యుత్, సాగునీటి వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

1,43,617 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతినగా.. రూ.874.97 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. మొత్తం 1,86,063 మంది రైతులు ప్రభావితమయ్యారు. మరోవైపు 6,756 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. దీనివల్ల రూ.337.10 కోట్ల మేర నష్టం జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. 12,605 మంది ఉద్యాన రైతులు నష్టపోయినట్లు నివేదికలో పేర్కొంది.

"రహదారులు, విద్యుత్ వ్యవస్థకు భారీ దెబ్బ*

తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తం 1,385 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతినగా.. 36 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయి. 65 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటి పునరుద్ధరణకు రూ.888.84 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 220 కిలోమీటర్ల మేర 114 రహదారులు దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

విద్యుత్ వ్యవస్థపై కూడా తుపాను ప్రభావం పడింది. 10,192 పదకొండు కేవీ విద్యుత్ స్తంభాలు, 6,442 ఎల్‌టీ స్తంభాలు, 1,448 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. మరోవైపు 369 సాగునీటి వనరులు ప్రభావితమవగా.. 509 చోట్ల గండ్లు పడినట్లు ప్రభుత్వం గుర్తించింది.

*3,859 ఇళ్లు దెబ్బతిన్నాయి*

తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో నివాస గృహాలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం 3,859 ఇళ్లు నష్టపోగా.. వీటిలో 645 గుడిసెలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వైద్య ఆరోగ్య, మత్స్య, పురపాలక, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పాఠశాలలు, పశుసంవర్ధక, చేనేత రంగాలపై కూడా తుపాను ప్రభావం పడింది.

అత్యవసర సహాయక చర్యల కోసం ప్రభుత్వం రూ.37 కోట్ల వ్యయం చేసినట్లు నివేదికలో పేర్కొంది.

*24 గంటల్లోనే సాధారణ పరిస్థితులు*

కేంద్ర బృందంతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యలు, తుపాను అనంతర సహాయక కార్యక్రమాలను వివరించారు. ఎల్‌నినో ప్రభావానికి తోడు ఒకేసారి రెండు తుపాన్లు రావడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని తెలిపారు. తుపాను గమనాన్ని ముందుగానే అంచనా వేసి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చెప్పారు.

తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టామని, రహదారులు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీని కేవలం 24 గంటల్లోనే పునరుద్ధరించగలిగామని వివరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.

పంటలు నష్టపోయిన రైతులకు బీమా పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అదనపు రేషన్ కూడా పంపిణీ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

*శాశ్వత పరిష్కారానికి కేంద్ర సాయం అవసరం*

కోస్తాంధ్ర ప్రాంతం తరచూ తుపాన్లను ఎదుర్కొంటోందని చంద్రబాబు కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. ప్రతిసారీ తుపాన్లు వచ్చినప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం కాకుండా.. భవిష్యత్తులో నష్టాన్ని తగ్గించేలా శాశ్వత మౌలిక వసతులు నిర్మించాల్సిన అవసరం ఉందని వివరించారు. రహదారులు, సాగునీటి వ్యవస్థలు, డ్రెయినేజీలు మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తుపాను నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసిన కేంద్ర బృందం పది రోజుల్లోగా సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరారు.

*పంటల నష్టంపై కేంద్ర బృందం ప్రత్యేక దృష్టి*

క్షేత్రస్థాయిలో తాము పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ముఖ్యంగా గ్రామీణ రహదారులు ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నాయని పేర్కొంది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన విషయాన్ని గుర్తించామని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కాలువలు, వాగుల్లో పూడికతీత పనులు చేపట్టడం వల్ల నష్టం కొంతమేర తగ్గిందని అభిప్రాయపడింది.

తూర్పుగోదావరి జిల్లాలో వరి పంటకు సుమారు 80 శాతం, ఏలూరు జిల్లాలో 90 శాతం వరకు నష్టం జరిగినట్లు కేంద్ర బృందం గుర్తించింది. ఉద్యాన పంటల్లో మామిడి, బొప్పాయి ఎక్కువగా దెబ్బతిన్నాయని తెలిపింది. అర్నబ్ తుపాను కంటే మురసు తుపాను కారణంగా భారీ వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ నష్టం జరిగినట్లు పేర్కొంది.

*గిరిజనులు, ప్రకృతి వ్యవసాయ రైతులకు ప్రత్యేక సాయం*

తుపాను కారణంగా గ్రామాల్లోని కచ్చా ఇళ్లు దెబ్బతిన్నాయని కేంద్ర బృందం తెలిపింది. బాధిత కుటుంబాలకు 30 రోజుల్లో మూడుసార్లు రేషన్ అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రీ స్కూల్ యూనిఫామ్స్ అందించాలని పేర్కొంది.

తుపాను ప్రభావం ఆదిమ గిరిజనులపై కూడా తీవ్రంగా పడిందని, వారిని ప్రత్యేకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. సేంద్రియ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట నష్టపోయిన రైతులకు సాధారణ పరిహారం కంటే అధిక సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. వాణిజ్య పంటలైన పత్తికి బీమా ప్రీమియం అధికంగా ఉండటంతో చాలామంది రైతులు బీమా చేయించుకోలేదని కూడా కేంద్ర బృందం ప్రస్తావించింది.

*కేంద్ర సాయం కోసం రాష్ట్రం ఎదురుచూపులు*

మొత్తంగా మురసు తుపాను రాష్ట్ర వ్యవసాయ, గ్రామీణ మౌలిక వసతుల రంగాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు ప్రభుత్వ నివేదిక స్పష్టం చేస్తోంది. నష్టాన్ని కేవలం పంట పరిహారానికే పరిమితం చేయకుండా.. రహదారులు, సాగునీటి వ్యవస్థలు, విద్యుత్, ఇళ్లు, ఇతర రంగాల పునరుద్ధరణకు కూడా కేంద్ర సహకారం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన, రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఆధారంగా కేంద్రానికి సమర్పించే తుది అంచనాలు ఇప్పుడు కీలకం కానున్నాయి. కేంద్రం నుంచి ఎంత మేరకు సాయం అందుతుంది? ఎప్పుడు విడుదలవుతుంది? రైతులు, బాధిత కుటుంబాలకు పరిహారం ఎప్పటికి చేరుతుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తుపాను నష్టం అంచనాల నుంచి బాధితులకు పరిహారం అందించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకం కానుంది.

Hari Kishan  AP Bureau Chief

Hari Kishan AP Bureau Chief

రెండు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సామాజిక మరియు పరిపాలనాంశాలపై క్షుణ్ణమైన పట్టున్న సీనియర్ జర్నలిస్ట్ మరియు ‘ఏపీ బ్యూరో చీఫ్’.